సాహిత్యానికి పుట్టినిల్లు..వనపర్తి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహిత్యానికి పుట్టినిల్లు..వనపర్తి!

వనపర్తి సంస్థానం సాహిత్య సరస్వతికి పుట్టినిల్లుగా విరాజిల్లింది. సంస్థానానికి మూల పురుషుడు వీరకృష్ణారెడ్డి. ఆయన సంతతిలో సుప్రసిద్ధుడై సాహిత్య సరస్వతిని ఆరాధించినవారు అష్టభాషా బహిరీ గోపాలరాయుడు. తిరుపతి, కంచి మొదలైన క్షేత్రాలను సందర్శించి అనేకమంది విద్వాంసులను వెంట తీసుకొచ్చేవారు. శ్రీరంగాపురంలో రంగనాయకస్వామి ఆలయాన్ని, రంగసముద్రం తటాకాన్ని నిర్మించారు. రామ చంద్రోదయ అను శ్లేషకావ్యాన్ని, శృంగారమంజరీ బాణం మొదలైన సంస్కృత గ్రంథాలను రచించారు. గోలకొండ ప్రభువుల నుంచి బహిరీ బిరుదును, పండితమండలి ద్వారా షడ్దర్శనీ వల్లభుడు అన్న బిరుదును పొందారు. ఈయన దత్తపుత్రుడు సవై వెంకటరెడ్డి గోపాలపేట అనే గ్రామాన్ని నిర్మించారు. వెంకటరెడ్డి కుమారుడు గోపాలరావు, ఆయన సంతతికి చెందిన రాజా ప్రథమ రామకృష్ణారావు తమ రాజధానిని సూగూరు నుంచి వనపర్తికి మార్చారు. ఆయన తర్వాత ఈ సంస్థానానికి ప్రభువులైన ప్రథమ రామేశ్వర, ద్వితీయ రామేశ్వర, తృతీయ రామేశ్వరరాయలకు సవై రాజా బహిరీ బలవంత్ మహారాజా బిరుదులున్నాయి. ద్వితీయ రామేశ్వరరాయలు సంస్థానాన్ని క్రీ.శ.1920 వరకు పాలించారు. ఆతర్వాత పాలించిన తృతీయ రామేశ్వరరావు స్వాతంత్య్రానంతరం సంస్థానాన్ని భారత్‌లో విలీనంచేశారు.

గ్రంథ రచనలకు పెద్దపీట
వనపర్తి సంస్థాన ప్రభువుల ఆశ్రయంలో గ్రంథ రచనలకు పెద్దపీట వేశారు. 150 ఏండ్ల కిందట అయ్యమాచార్యులు చెన్నకేశవ విలాసం, రామేశ్వర విజయం అను గ్రంథాలను, 200 ఏండ్ల కిందట వీరరాఘవాచార్యులు సంస్కృత మహా భాగవతానికి వీరరాఘనీయం అను వ్యాఖ్యను, 250 ఏండ్ల కిందట చెన్నకృష్ణకవి యాదవ భారతీయ మనుద్వ్యర్థి ప్రబంధాలను రచించారు. వేపర్ల గ్రామానికి చెందిన పండితుడు అక్షింతల సుబ్బాశాస్త్రి, వనపర్తికి చెందిన హోసదుర్గం కృష్ణమాచార్యులు బహుగ్రంథకర్తలు. ధర్మాధికారిగా ఉన్న హోసదుర్గం శ్రీనివాసరాఘవచార్యులు వీర రాఘవీయ భుమిక, ఆచార్య వైభవం, స్వభావపద్ధతి గ్రంథాలను రచించారు. కడుకుంట్ల గ్రామానికి చెందిన పాపాశాస్త్రి భారత సంగ్రహం, భ్రమరాంబిక సంవాదం కావ్యాలను రచించారు. రాజనగర గ్రామానికి చెందిన విక్రాల నరసింహాచార్యులు భారతీస్తుతి, కల్యాణి, మాలతీ మాధవం (భవభూతి రూపకానికి అనువాదం), కురుసంధానం, దూతాంగదం, జగన్మోహన బాణం అనే గ్రంథాలను రచించారు. మాదిరాజు విశ్వనాథరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రితో కలిసి విక్రమాంక దేవచరిత అను ప్రౌఢ ప్రబంధాన్ని, కర్ణసిందరీ నాటకంను రచించారు. సంస్థాన పరిధిలో విద్వత్కవి గాయక సభలను కూడా గొప్పగా నిర్వహించారు. ఈ సభల్లో ఆచార్య రంగాచార్యులు, నంబాకం రాఘవాచార్యులు, శేఠలూరు శేషాచార్యులు, విక్రాల వెంకటాచార్యులు మొదలైన మహాపండితులతోపాటు సుప్రసిద్ధ తర్కవిద్వాంసులు ధూళిపాళ సూర్యనారాయణశాస్త్రి, శ్రౌతపండితులు నూకల సుబ్రహ్మణ్యశాస్త్రి, వ్యాకరణ పండితులు కాశావఝల సత్యనారాయణశాస్త్రి పాల్గొనేవారు.

WanaparthyKota

ధూళిపాళవారికి, నంబాకంవారికి జరిగిన తర్కశాస్త్ర చర్చలు, మైసూరు నుంచి వచ్చిన కాశీసుబ్రహ్మణ్యశాస్త్రికి అచ్చంపేట నరసింగయ్యశాస్త్రి, వట్టెం ఖండవెల్లి నరసింహశాస్త్రికి మధ్య జరిగిన వ్యాకరణ శాస్త్ర చర్చలు అప్పటి పండిత బృందాలను ఆకర్శించాయి. రాజారామేశ్వరరావు బహద్దూరువారు కొత్త పద్ధతిగా జరిపిన విద్వత్సభలలో ధర్మ అను విషయంపై మైసూరు సంస్థాన విద్వాంసులు కేపీ శంకరశాస్ర్తులు, స్పోటవాదంపై అచ్చంపేట వాస్తవ్యుడు, కాశీ పండితులైన పండిత నరసింగయ్య శాస్ర్తులు, కావ్యలక్షణంపై తెనాలి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ సూరి రామకోటిశాస్త్రి, పాణినీయ వ్యాకరణంపై వట్టెం ఖండవెల్లి నరసింహశాస్త్రి, సర్వదర్శన మత తత్తామృతం, దర్శనాచార్య శిరోమణిపై టీకేవీఎన్ సుదర్శనాచార్యులు, న్యాయదర్శనంపై జటప్రోలు సంస్థాన పండితులు వనం సీతారామశాస్ర్తులు, విశిష్టాద్వైత దర్శనంపై కందాడై రంగాచార్యులు, పాణినీయ దర్శనంపై దేశీచార్యులు, తర్కశాస్త్రంపై నంబాకం రంగనాథాచార్యులు, బల్మూరు వెంకటనాథాచార్యులు, ఆయుర్వేధ పరిశోధనలుపై పండిత, శతావధాని, ఆయుర్వేదాచార్య తిరుమల వేంకటరామానుజస్వామి, వేదంపై పల్లా రామకృష్ణావధానులు రచించిన వ్యాసాలను తమ ఆస్థానపండితులైన ఆంధ్ర బిల్హణ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి సంపాదకత్వంలో ముద్రించారు. వనపర్తి సంస్థాన పరిధిలో ఏటా శ్రీరంగాపురంలో ఫాల్గుణ పూర్ణిమనాడు జరిగే కవిగాయక సభల్లో తిరుపతి వేంకటకవులు పాల్గొనేవారు. వీరితోపాటు గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వనపర్తి సంస్థానం నుంచి సత్కారాలు పొందిన సాహిత్య పండితులు.

వందేండ్ల కిందటే ముద్రాక్షరశాల
వనపర్తి సంస్థానంలో గ్రంథాల తయారీకి కూడా అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రాజా రామేశ్వరరావు బ్రహ్మవిద్యా ముద్రాక్షరశాలను సంస్థానంలో ప్రత్యేకంగా నెలకొల్పారు. మహా విద్యాంసులు శ్రీమానవల్లి రామకృష్ణ కవి పర్యవేక్షణలో వీర రాఘవీయ వ్యాఖ్యను ముద్రించారు. విస్మృతకవులు అన్న శీర్షికతో నన్నెచోడుని కుమార సంభవం, బద్దె భూపాలుని నీతి శాస్త్రముక్తావళి, బైరవకవి రంగమాహాత్మ్యం, ప్రబంధ మణిభూషణం, వేంకటేశోదాహరణం లాంటి గ్రంథాలను ముద్రించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/literature-birth-place-in-wanaparthy-1-2-561899.html