భాషను బతికించుకుందాం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

భాషను బతికించుకుందాం

WTC-KSR-1ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణంలోని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై జరిగిన పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాష మీద మక్కువ, పట్టు ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణకు మాత్రమే ఉన్నాడని తెలిపారు. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మరుగున పడిపోయిన పదాలను తిరిగి వాడుకలోకి తీసుకొనిరావాల్సిన అవసరం ఇప్పుడున్నదని తెలిపారు. సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి మాట్లాడుతూ భాషా వినియోగంలో లోపాలు నిత్యం పత్రికల్లో కనిపిస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని చెప్పారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి పరిపాలన దాకా అంతటా ఇంగ్లిష్ కనిపిస్తున్న కాలంలో తెలుగును బతికిస్తున్నది కేవలం పత్రికలేనని పేర్కొన్నారు.

నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ యువతలో అధ్యయనం లోపిస్తున్నదని, సాహిత్యం, చరిత్ర పట్ల ఎలాంటి అవగాహన లేనివారు పాత్రికేయ వృత్తిలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధ్యయనం లేకుండా భాషను, భావోద్వేగాలను, జీవితాన్ని అర్థం చేసుకోవడం కష్టమని చెప్పారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు ఉద్వేగపూరిత వాతావరణంలో జరుగుతున్నాయని, ఈ సందర్భంగా భాషావికాసంపై లోతైన చర్చ జరుగాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ సంపాదకులు, భాషావేత్తలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి, పత్రికా పారిభాషిక పదకోశాన్ని, శైలిపత్రాల్ని తయారుచేయాలనే అభిప్రాయాన్ని మీడియాఅకాడమీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు, జీఎస్ వరదాచారిని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావు, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహరావు, సీనియర్ పాత్రికేయుడు ఉడయవర్లు పాల్గొన్నారు.

indrakaran-reddyతీర్పులు తెలుగులో రావాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రవీంద్రభారతి: ప్రజల భాషలో పరిపాలన జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ ప్రాంగణం (రవీంద్రభారతి సమావేశ మందిరం), ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై న్యాయ పరిపాలన రంగాలలో తెలుగు పై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో తెలుగును అమలు చేయడంద్వారా సామాన్య ప్రజలకు చేరువ అవుతామని పేర్కొన్నారు. కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధ్యక్షోపన్యాపం చేస్తూ న్యాయవ్యవస్థలో తెలుగు అమలుచేయటానికి వ్యవస్థాపక మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, ఐజీ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల భాషలో పాలన ఉండాలని పేర్కొన్నారు. న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ తెలుగులో పరిపాలన జరగకుంటే న్యాయం జరుగదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన ఉత్తర్వులు తెలుగులో వస్తేనే వారికి అర్థమవుతాయన్నారు. మహ్మద్ అబ్దుల్లా రాసిన పోలీసులు-వ్యక్తిత్వ వికాసం పుస్తకాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీ చంద్రయ్యను సత్కరించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/conclaves-will-remain-in-history-says-k-keshava-rao-1-2-562445.html