సాహితీ వారసత్వాన్ని కొనసాగిద్దాం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహితీ వారసత్వాన్ని కొనసాగిద్దాం

telangana-books
తెలంగాణలో అన్ని ప్రక్రియల సాహిత్యకారులున్నారని, వారి సాహితీ వారసత్వాన్ని కొనసాగిద్దామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం జరుగాలని సూచించారు. హైదరాబాద్‌లోని హరితప్లాజాలో గురువారం నిర్వహించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై.. తెలంగాణ ప్రచురణలు సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలుగుభాషపై వివక్ష చూపాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు తెలుగుభాషంటే ఎంతో అభిమానం ఉన్నదని, అందుకే 1 నుంచి 12వ తరగతుల వరకు తెలుగును ప్రథమ భాషగా అమలుచేయాలని నిర్ణయించారని చెప్పారు. తెలుగుభాషకు ఘన చరిత్ర ఉన్నదని, దాన్ని చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని, తెలుగుభాష అభివృద్ధికి సాహితీవేత్తలు, భాషాభిమానులు తగిన సూచనలు చేయాలని కోరారు. మహాసభల ప్రారంభానికి ముందు రోజే 25 పుస్తకాలను వెలువరించిన తెలంగాణ ప్రచురణలు సంస్థను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పుస్తకానికి ఎంతో విలువ ఉంటుందని, ఏదైనా ఒక పుస్తకం వెలువరిస్తే అది ఆ రోజుకు మాత్రమే కాదని, దానిపై చర్చ జరిగి భవిష్యత్ తరాలకు సాహిత్యం, భాషాపరంగా మార్గదర్శనం చేస్తుందని చెప్పారు.

1970లోనే పరిపాలనాపరంగా తెలుగును వినియోగించాలని ఉత్తర్వులు జారీచేసినా, అది అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. తెలుగు సమాచార చానళ్లలో తెలుగుభాషకు ప్రాధాన్యతనిచ్చేలా వార్తా కథనాలు ఉండాలని, మహాసభల స్ఫూర్తితో అందరూ భాషా ప్రాముఖ్యతపై దృష్టిసారిస్తారని భావిస్తున్నానని ఎంపీ కవిత ఆకాంక్షించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా సాహిత్యం, సాంస్కృతిక గొప్పదనాన్ని ఎన్నటికీ విస్మరించకూడదని చెప్పారు. తెలంగాణ భాషలో చాలా పద సంపద ఉంటుందని, జీవ భాషను సజీవంగా నిలిపేలా సాహిత్య ప్రక్రియలు ఉండాలని, సాహితీ వైభవాన్ని చాటేలా రచనలు సాగాలని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మన సంస్కృతి నిలబడుతుందని ప్రజలు ఆకాంక్షించారని, అనుకున్నట్టుగానే మన సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటుకునేందకు అవకాశం దక్కిందన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు బీ నర్సింగరావు మాట్లాడుతూ తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటి చెప్పేందుకే తెలంగాణ ప్రచురణలు సంస్థ పుస్తక ముద్రణను చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ఆచార్య రవ్వా శ్రీహరి, కే శ్రీనివాస్, అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ ప్రచురణలు సంస్థ వ్యవస్థాపకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ ఎం వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆవిష్కరించిన పుస్తకాలు ఇవే
చరిత్రకెక్కని చరితార్థులు, ధనాభిరామం, తొలిసంజ, జాతీయ గేయాలు, కాపుబిడ్డ, భాగ్యనగర వైభవం, సంఘం, ప్రత్యూష, ఆదిరాజు వీరభద్రరావు జీవితచరిత్ర, అంజలి, సుజాత (తెలంగాణ ప్రత్యేక సంచిక), సుషుప్తి (మాదిరెడ్డి సులోచన నవల), నైజాం రాష్ట్ర ప్రశంస, మహైక తెలంగాణ నవల, బొమ్మా హేమవతి కథలు, స్వాతంత్య్ర సమరంలో ముస్లిం యోధులు, గుంటక పురాణం, శరధార, భద్రగిరి శతకం, తొలికారు, బహువచనం, శృంగార సుధా సముద్ర, పూర్ణోదయం ఇతరాలు ఉన్నాయి.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/lets-continue-the-literary-heritage-1-2-562136.html