నేటి నుంచి ప్రపంచ తెలుగు వైభవం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

నేటి నుంచి ప్రపంచ తెలుగు వైభవం

రెండువేల ఏండ్ల తెలుగు భాషా సాహిత్య చరిత్రలో సరికొత్త యుగం ఆవిష్కృతమవుతున్నది. సమస్త తెలుగుజాతిని ఏకంచేసి పాలించిన కాకతీయుల కాలంలో విరాజిల్లిన తెలుగు సరస్వతి.. మళ్లీ ఆ స్వర్ణయుగాన్ని చూడబోతున్నది. మన తెలంగాణము తెలుగుకు మాగాణమని చాటుకుంటున్న సందర్భమిది. దశాబ్దాల తరబడి తెలంగాణేతరుల వలస పాలనలో విస్మృతికి గురైన తెలంగాణ సాహిత్యం ఉజ్జలంగా వెలుగులీనుతున్న అద్భుతమైన దృశ్యమిది. తెలుగు అక్షరకాంతులను విశ్వమంతటా వెదజల్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. అనితరసాధ్యమైన రీతిలో తెలుగు సంబురాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు అపూర్వమైన ఆతిథ్యాన్ని చవిచూడబోతున్నారు. తెలుగు సాహిత్య అస్తిత్వ ప్రతీకలైన మహానుభావులు హైదరాబాద్ నలుచెరగులా తామే స్వాగత తోరణాలుగా నిలిచి.. మహాసభలకు సమస్త ప్రజాసమూహాన్ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అన్ని ప్రక్రియలపై ఐదు రోజులపాటు నిరంతరంగా జరిగే అనేక సదస్సులు, కవి సమ్మేళనాలు, అవధానాలతో ఈ మహాసభలు తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని కొత్తమార్గం పట్టించనున్నాయి.

telugu-mahasabalu
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ప్రపంచ తెలుగుమహాసభలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఈ మహాసభలను ప్రారంభిస్తారు. తెలుగు భాష సాహిత్యాలపై ఒక దార్శనికతతో ప్రపంచ మహాసభలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు విశిష్ట అతిథులుగా ఈ ప్రారంభ వేడుకలలో పాల్గొంటారు. ప్రధాన వేదికైన లాల్‌బహదుర్ స్టేడియంతోపాటు ప్రధాన వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎల్బీ స్టేడియంతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ సారస్వత పరిషత్‌లన్నీ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేవిధంగా అలంకరించారు. ఈ సభల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొన్నారు. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపైన వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన డా.రాధా రాజారెడ్డి మన తెలంగాణ నృత్యరూపకం ప్రారంభసభలకు హైలైట్‌గా నిలువనున్నది. అనంతరం రామాచారి బృందం పాటలకచేరి ఉంటుంది.

జయ జయోస్తు సంగీత నృత్యరూపకాన్ని కళాకృష్ణ బృందం ప్రదర్శిస్తున్నది. తెలుగుభాషలో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి అందుకున్న సాహితీ దిగ్గజాలు నగరానికి చేరుకున్నారు. ఒరియా, సంస్కృతం భాషలలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న సాహితీ వేత్తలు అతిథులుగా విచ్చేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు నగరానికి చేరుకున్నారు.సాయంత్రం ఆరు గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సాంస్కృతిక సమావేశం నిర్వహిస్తారు. దీనికి ముఖ్యఅతిథిగా నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ హాజరవుతారు. ప్రధానవేదికైన ఎల్బీస్టేడియంలో కాకతీయుల కాలం నుంచి ప్రాచీన శిల్ప కళాకృతులు.. తెలంగాణ ప్రాంతంలోనే అనేక ఆలయాల నమూనాలను ఏర్పాటుచేశారు. తెలంగాణ పల్లెసీమలను తలపించే విధంగా స్టాళ్లను నెలకొల్పారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి కారణమైన జినవల్లభుని కురిక్యాల శాసనం నమూనాను మహా సభల వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. శాసనంలోని కందపద్యాలను తప్kadiyam-srihariపనిసరిగా వేదిక సమీపంలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ శాసనాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. శాతవాహనుల కోటిలింగాలలో లభించిన నాణేలతోపాటు, ఫణిగిరి నాణేలు, అసఫ్‌జాహీల కాలంనాటి నాణేలను ప్రదర్శించనున్నారు.

ఈ వరుసలోనే తెలుగుభాష చరిత్రకు గొప్పకానుకలను అందించిన అపురూపమైన తాళపత్రగ్రంథాల నమూనాలను ప్రదర్శిస్తారు. సిరిసిల్ల, పోచంపల్లి, పుట్టపాకల నుంచి వచ్చిన చేనేత వస్ర్తాలను ఈ ఐదు రోజులపాటు ప్రదర్శిస్తారు.
తెలుగు అకాడమీ, తెలంగాణ రాష్ట్ర సాహిత్యఅకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్‌లతో పాటు సాహితీ వేత్తలు కలిసి మొత్తం ఈ ఐదు రోజులలో అనేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. తెలుగు అకాడమీ 60 పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, భాగ్యరెడ్డివర్మ, వంటి మహామహుల మోనోగ్రాఫ్‌లను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ 25 పుస్తకాలను ప్రచురించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాల ప్రకారం వాగ్భూషణమ్ భూషణమ్, మందార మకరందాలు పుస్తకాలను కిట్‌లలో భాగంగా అందజేస్తున్నారు.

హోటళ్ల సంఘం సారథ్యంలో 65 రకాల తెలంగాణ రుచులను సరసమైన ధరలలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొన్నారు. మహాసభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ఐదువేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. భాషాపండితులతోపాటు విశ్వవిద్యాలయాల ఆచార్యులు, కళాశాలల ఉపన్యాసకులు కూడా వస్తున్నారు. కాగా మహాసభలకు పోలీసు విభాగం పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు తీసుకొన్నది. సుమారు 12వేలమంది పోలీసులతో కట్టుదిట్టంగా భద్రతాఏర్పాట్లు చేశారు. అతిథులు, ప్రతినిధులు బసచేసే హోటళ్లు, వేదికల వద్ద పటిష్ఠమైన భద్రతాచర్యలు చేపట్టారు. సభలకు హాజరయ్యే వారి వాహనాలకు ఇబ్బంది కలుగకుండా ఆయా ప్రదేశాల్లో దాదాపు 30.5 ఎకరాల ఖాళీ స్థలాలను గుర్తించి 1600 పెద్ద వాహనాలు, 6000 వాహనాలు ఒక్కే సారి పార్క్ చేసుకొనే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లుచేశారు. ముఖ్యఅతిధులు, వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే మార్గాలు, ప్రధాన వేదిక, కార్యక్రమాలు జరిగే ప్రాంగణాలు, వసతి గృహాల వద్ద భారీగా పోలీసు సిబ్బందిని మొహరించారు. ప్రధాన వేదిక వద్ద భద్రత ఏర్పాట్లను ఆ ప్రాంత డీసీపీ పర్యవేక్షిస్తారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఉన్నతాధికారులు మహాసభలు జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రతి దృశ్యాన్ని వీక్షించనున్నారు.
Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/lb-stadium-is-geting-ready-to-prapancha-telugu-mahasabhalu-1-2-562150.html