భాష బలహీనమైతే బంధం బలహీనం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

భాష బలహీనమైతే… బంధం బలహీనం

Telugu-MahaSabhalu
ప్రశ్న : తెలుగుచలనచిత్రపరిశ్రమలో తెలంగాణ కవులకు సరైన గౌరవం ఉందా?

జవాబు : తెలంగాణ కవులకు, రచయితలకు తెలుగు చలనచిత్ర రంగంలో తగిన గౌరవమే ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి లాంటి వాళ్ళంతా తెలంగాణ కవులేకదా! ప్రతిభ ఉంటే గౌరవం ఉంటుంది. సినిమారంగంలో తొక్కివేయడం అంటూ ఉంటుందని నేను అనుకోవడంలేదు. నాతో పాటు అనేక మంది తెలంగాణకు చెందిన కళాకారులు, రచయితలు, కవులు నిర్మాతలు ఉన్నారు. వారంతా మంచి అవకాశాలనే అందుకుంటున్నారు. ఎలాంటి వివక్షకు గురి కావడం లేదు.

ప్ర.: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగుభాష ను ఏ మేరకు సుసంపన్నం చేస్తాయి?

జ: ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరగడం గొప్ప అవకాశం. ఇంత పెద్దఎత్తున మహాసభల ఏర్పాట్లను ఎప్పుడు చూడలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు తెలుగు భాషాభిమాని కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలుగుభాష అభివృద్ధి కోసం ఒకటవ తరగతి నుంచి 12 వతరగతి వరకు తెలుగును కచ్చితంగా చదవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఒక భాషాభిమానిగా ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్న. పండుగ చేసుకున్నంత సంబురపడ్డాను. ఎప్పటినుంచో నాలో ఉన్న ఈ కల ఇప్పుడు నెరవేరుతోంది.

ప్ర: తెలుగు ప్రాచీన భాష అనేందుకు మూలం తెలంగాణలోనే ఉండడంపై కవిగా మీకే మనిపిస్తోంది?

జ: తెలుగు భాష, సంస్కృతి అతి ప్రాచీనమైనవి. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో హాలుడు రాసిన ‘గాథాసప్తశతి‘ లో అచ్చతెలుగు పదాలు ఉన్నాయి. ఈ శిలాశాసనాలు తెలంగాణలోనే లభ్యమయ్యాయి. ప్రాచీన కవులు అందించిన సాహిత్యాన్ని, ఆ పూర్వ కవులను స్మరించుకునే సందర్భాన్ని తెలుగు మహాసభలు అందించడం ఆనందం కలిగిస్తుంది. ఈ సందర్భంగా నేను ఎప్పుడో రాసిన ఒక పాట గుర్తుకువస్తుంది… “పరభాష జ్ఞానాన్ని సంపాదించు … కానీ నీభాషలో నీవు సంభాషించు… అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు… అది భాష ఆచారాలను మింగేయవద్దు”. మహాసభలు జరుగుతూ ఉంటే భాష చైతన్యం వస్తుంది, భాష సుసంపన్నం అవుతుంది. అందుకే నేను అంటాను… ‘భాష బలహీనమైతే బంధం కాదా బలహీనం… తెలుగేరా అతి ప్రాచీనం.. తెలుగేరా ఆధునికం’.

ప్ర. మీ పాటల రచనల్లోని పదప్రయోగాలకు ప్రేరణ?

జ. అందరూ చూసేది అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదేలోకం, అదే భూగోళం, అవే స్థితిగతులు. కానీ కవికి భిన్నంగా కనిపిస్తుంది, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఆ ఆలోచనల్లో పురోగమనం, తిరోగమనం ఉంటుంది. నిన్నటి ఆలోచన రేపు ఉండదు. సంఘర్షణల్లో కొత్త ఆలోచనలకు ప్రేరణ లభిస్తుంటుంది. నా అంతరంగావ్ని నేను ప్రశ్నించుకుంటాను, చర్చించుకుంటాను, సంభాషించుకుంటాను, అంతర్ యానం చేస్తుంటాను. ప్రజల పెదాలపై పాటలుగా కదులుతుంటే కవి హృదయం ఉప్పొంగుతుంది. ప్రతి కవిలో ఒక్కో కోణం ఉంటుంది. మనకు ప్రాచీన సాహిత్యసంపద ఉందని గర్వపడటంతోపాటు ఆ సంపదను ఎంత ఉపయోగించుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి…

ప్రశ్న. : తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఎలా మొదలైంది?

జ. బతుకుతెరువు కోసం ఇంజనీరింగ్ చదివాను. చిన్నప్పటినుంచి తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉండేది. మా ఊరు గ్రంథాలయంలోనిబాలసాహిత్యం నన్ను ఆకట్టుకుంది. సాహిత్య పుస్తకాలు ఎక్కువగా చదవడంతో పదసంపదపై పట్టు ఏర్పడింది. బాలల పుస్తకాల్లో వ్యాక్య నిర్మాణం సులభంగా, సూటిగా పిల్లలను హత్తుకునే విధంగా ఉంటుంది. అల్పమైన మాటలతో అనల్పమైన భావాన్ని సృష్టించడం బాలసాహిత్యం నాకు నేర్పింది. సాహిత్యంలోని జనపదాలు ఊహాశక్తిని పెంచాయి.