సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది - Wold Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది

తొలిదశ తెలంగాణోద్యమంలో మన యాసను హేళన చేసిన వారిని ఖండించిన కాళోజీ వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తిపాడిన కవి దేశపతి శ్రీనివాస్. కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగానే కాకుండా సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారిగా ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ప్రభుత్వ సాంస్కృతిక దృక్పథాన్ని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
DeshapathiSrinivas
ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు నిర్వహిస్తున్నారు?
తెలంగాణ ప్రజలు స్వరాష్ర్టాన్ని, స్వపరిపాలనను కోరుకుని ఉద్యమించారు. దీనివెనుక సామాజిక, ఆర్థిక కారణాలతోపాటు ప్రబలమైన సాంస్కృతిక కోణం కూడా ఉంది. అనేక విశిష్టతలతో, ప్రత్యేకతలతో, వైవిధ్యంతో కూడిన తెలంగాణ భాషా సంస్కృతులకు తగిన ప్రతిపత్తి లభించాలనే ఆరాటం ఉంది. తమ బతుకు ప్రతీకగా బతుకమ్మను ఉద్యమ వేదికపై ప్రతిష్ఠించారు. భాష, సాహిత్యాలకు సంబంధించిన చారిత్రక పరిణామాలను నూతన దృక్పథంతో విశ్లేషించారు. ఉద్యమవేదికలపై తెలంగాణ ధూంధాం జనజీవనాన్ని ప్రతిబింబించింది. ఆ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నాం.

ఐదు రోజుల వేడుకల్లో ఏం చెప్పదలుచుకొన్నారు?
రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాసభల ద్వారా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతున్నది. ఉద్యమకాలంలో వచ్చిన సాంస్కృతిక విలువలను వ్యవస్థీకృతం చేయాలని సంకల్పించింది. అందుకోసం మొదటగా సాహిత్యఅకాడమీని నెలకొల్పింది. రానున్న రోజుల్లో సంగీత నాటక అకాడమీ, లలితకళా అకాడమీ కూడా ఏర్పాటు కాబోతున్నది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రారంభాన్ని విస్త్రత స్థాయిలో తెలియజేసేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు. ఇది ఒక ఆరంభం. ఆ తర్వాత నిలకడగా సాగే కార్యచరణ ఉంటుంది.

మహాసభలు పామరులను ప్రభావితం చేస్తాయా?

ప్రపంచ తెలుగు మహాసభలు ప్రకటించిన వెంటనే తెలంగాణ అంతా సాహిత్య పూరితమైన వాతావరణం ఏర్పడింది. జిల్లాలో, ఇతర రాష్ర్టాల్లో సన్నాహక సభలు జరుగుతున్నాయి. కవుల సాహిత్యంపై పిల్లలు కూడా వ్యాసాలు రాస్తున్నారు. పత్రికలన్నీ తెలంగాణ సాహిత్య యానం, తెలంగాణ భాష ప్రత్యేకతల గురించి చర్చిస్తున్నాయి. సమాజంలో సాహిత్య చేతన కనిపిస్తున్నది. భాషా చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఇదే మహాసభల లక్ష్యం. నిర్మాణాత్మకమైన పద్ధతిలో రానున్న రోజుల్లో జరుగుతుంది. మరింత విశాలంగా చేస్తాం. నిర్మాణాత్మక కృషి చేస్తాం. పరిశోధనలు, పదకోశాలు మొదలైన గ్రంథాల రచన, ప్రచురణ ద్వారా నిర్మాణాత్మక కృషి కొనసాగుతూనే ఉంటది.

ఇతర ప్రాంతాల వారిని ఎందుకు పిలుస్తున్నారు?

తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. తెలుగు భాషా వారసత్వం కలిగిన ప్రాంతం. తెలుగనే మాట నిన్నటివరకు ఉమ్మడి రాష్ట్ర స్వభావం ఆపాదించబడింది. కానీ నేడు దానికి ఆ స్వభావంలేదు. తెలుగుతల్లి ప్రతీక ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం పోవడంతో ఆ ప్రతీక అసంగతంగా మారిపోయింది. నేడు కేవలం భాషా స్వభావంతోనే ఉంది. కాబట్టే తెలుగు వారందరినీ పిలుస్తున్నాం. ఇది తెలంగాణలో తెలుగు భాష, సాహిత్య వికాసం గురించి చర్చించే వేదిక. తెలుగులోని పలు అస్తిత్వాలన్నింటినీ కలుపుకుంటేనే తెలుగుకు సమగ్రత. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మాండలికాలకు కూడా అనుకూలమైన మంచి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రాంతాలలో వుండే తెలుగు వ్యవహారమంతటికి గౌరవం లభించే విధంగా కృషి జరుగాలె. తెలుగు మహాసభలు ఇందుకు ప్రేరణనిస్తాయి.

ఈ తరానికి తెలుగు మహాసభల సందేశం ఏమిటి?
ఈ ఉత్సవాలతో తెలంగాణలో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో ఈతరానికి తెలుస్తుంది. సాహితీవేత్తలకు సమాజంలో ఉండే ప్రాధాన్యం అర్థమవుతుంది. కొత్త పరిశోధనలకు ప్రేరణగా నిలుస్తుంది.

కళాశాల స్థాయివరకు తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఫలితం?

ఇవాళ ఇంగ్లిషు ద్వారానే ఉపాధి అవకాశాలున్నాయనే అభిప్రాయం జనంలో ఏర్పడ్డది. అది అర్థసత్యం. కానీ జనాభిప్రాయం ఉన్నది కాబట్టి మాధ్యమం విషయంలో మాట్లాడలేని స్థితి ఉన్నది. వాస్తవికతను గుర్తిస్తూ ఆంగ్ల మాద్యమంలో చదువుకోవాలనే ఆకాంక్షను గౌరవించాలి. అదే సందర్భంలో తెలుగు అసలు చదువకుండా ఉండే పరిస్థితి తలెత్తకూడదనే తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ఆధునిక భాషగా తెలుగు మనగలిగేందుకు ఏం చేస్తున్నారు?
కొత్త అవసరాలకు అనుగుణంగా తెలుగును తీర్చిదిద్దడంపై మేధోస్థాయి చర్చలు తెలుగు మహాసభల్లో నిర్వహిస్తాం. శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ వ్యవహారాలు, పాలనా వ్యవహారాల్లో తెలుగు వినిమయం ఉండేలా ఒక బృహత్‌ప్రణాళిక ముఖ్యమంత్రి మదిలో ఉంది.
భాషాభిమానులందరికీ ఆహ్వానాలు అందాయా?
అందరినీ గుర్తించి ఆహ్వానిస్తున్నాం. ఎంతమందిని పిలిచినా, ఎంత చేసినా ఏదో ఒక చిన్న లోటు ఉంటుంది. అందరూ తమ కార్యక్రమంగా భావించి, తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి, ఈ సభలు విజయవంతం కావడానికి కృషి చేయాలి.
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ మహనీయుల విగ్రహాలను స్థాపిస్తారా?
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ మహనీయుల విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

ఈ మధ్య కవులందరిపై పాటలు రాశారు. ఆ పాటలకు ప్రేరణేమిటి?
ఉద్యమ కాలంలో వట్టికోట ఆళ్వారుస్వామి, జయశంకర్ సార్‌పై పాటలు రాసిన. పాడిన. ఆ తర్వాత మరికొందరు కవులపై పాటలు రాయాలని అప్పుడే అనుకున్న. ఇప్పుడు రాస్తున్న. తెలంగాణ భాష, సాహిత్యాల ప్రేరణతో ఈ పాటలు రాసిన. తత్వకవులు, దాశరథి, కాళోజీలపై పాటలు రాసిన. గతంలో రాసిన పాటల్లో జానపదముద్ర ఉంది. ఇటీవల రాసినపాటల్లో మార్పు ఉంది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/lalithakala-and-musical-drama-academies-set-up-soon-1-2-561285.html