భాషాభిమానం ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరే - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

భాషాభిమానం ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరే

ఓ ముఖ్యమంత్రి కవులు, రచయితలతో 4 గంటలపాటు చర్చించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. తెలుగు మహాసభల సందర్భంగా ఆయనతో నమస్తే తెలంగాణ ముచ్చటించింది. కూచిపూడి నృత్యం తెలంగాణకు చెందిన నాట్యప్రక్రియ అనే వాదనను ఆయన తెరమీదకు తీసుకొచ్చారు.

ప్రపంచ తెలుగు మహాసభలపై మీ అభిప్రాయం?
భాషాభిమాని, సాహిత్యాభిలాషి ముఖ్యమంత్రిగా ఉంటే పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. దేశంలో భాషపట్ల, సాహిత్యం పట్ల ఇంత అభిమానం చూపే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప మరొకరు లేరనటంలో అతిశయోక్తి లేదు. కవులు, రచయితలతో నాలుగు గంటలపాటు చర్చించిన సీఎం ఆయనొక్కరే. సాహితీవేత్తలపట్ల ఆయనకున్న గౌరవానికి అది నిదర్శనం. సినారె మరణించిన సందర్భంలోనూ ఆయనలోని సాహిత్యాభిమానం, సాహితీవేత్తపట్ల ఆయనకున్న గౌవరం అర్థమైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా పెద్దకొడుకులాగా దగ్గరుండి సినారె అంత్యక్రియలను పర్యవేక్షించారు.

కూచిపూడి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు. ఎందుకు?
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామం యక్షగాన సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఇక్కడ 15ఏండ్ల క్రితం వరకు సంచారజాతులుండేవారు. సంచారజాతుల యక్షగానాలు, పగటివేషాలు, బహురూపులవాళ్ల రూపప్రక్రియల నుంచే కూచిపూడి వచ్చింది. యక్షగానం తెలంగాణకు చెందిన ప్రక్రియ. కాబట్టే కూచిపూడి నృత్యం తెలంగాణదే. మచిలీపట్నం సమీపంలోని కూచిపూడిలో భాగవతులకు కుతుబ్‌షాహీలు భూమిని ఇనాంగా ఇచ్చారు. కూచిపూడి ఆడేవాళ్లు కాబట్టి దానికి కూచిపూడి అనే పేరొచ్చింది. కానీ కూచిపూడిలో పుట్టటం వల్లనే ఈ నాట్యప్రక్రియకు ఆ పేరు వచ్చిందనటం తప్పు.

కూచిపూడికి, తెలంగాణకు వున్న సంబంధాలకు ఆధారాలున్నాయా?
కూచిపూడికి శాస్త్రీయ గ్రంథాలేవీ లేవు. తరతరాల ఆచారాలే దానికి భూమిక. కాలానుగుణంగా ప్రక్రియలను మార్చుకొంటూ కూచిపూడి వచ్చింది. ఇతర నాట్యశాస్త్రంలో ఉన్న స్థిరీకరణ కూచిపూడి నాట్యంలో కనిపించదని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. రాచకొండనేలిన సింగభూపాలుడు కన్నడంలో నాట్యశాస్త్రం లాస్యరంజనం రచించాడు. లాస్యరంజనంలోని దేశీయ సంప్రదాయాన్ని, నాట్యశాస్ర్తాన్ని కూచిపూడిలో స్వీకరించారు. భరతుడి నాట్యశాస్ర్తాన్ని యక్షగాన కళాకారులు స్వీకరించారు. కూచిపూడిలోకి ఈ అనుకరణ, అనుసరణ ఉన్నది. మన రాచకొండల నుంచి నృత్యశాస్ర్తాలు పుట్టుకొచ్చాయని చరిత్ర చెప్తున్నది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kuchipudi-came-from-the-tradition-of-the-yakshagana-1-2-562141.html