గుండెల నిండుగ తెలుగు పండుగ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

గుండెల నిండుగ తెలుగు పండుగ

CMKCR
నేను ఉత్తి మాటలు చెప్పను.. ఉత్తమ కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంది. ప్రపంచ తెలుగు భాషాభిమానులంతా హర్షించేలా, తెలుగు భాష కోసం కృషి చేస్తున్నవారిని అన్ని విధాలుగా ఆదుకొనే రీతిలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో మంచి పథకాలను ప్రకటిస్తా. అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలుగు భాషోన్నతికి, సారస్వత అభివృద్ధికోసం చారిత్రాత్మక నిర్ణయాలను వెలువరిస్తామని తెలిపారు. తాము తీసుకొనే నిర్ణయాలు యావత్ప్రపంచంలోని మాతృభాషాభిమానులను సంతోషపరుస్తాయని చెప్పారు. ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజున మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్)లోని శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై జరుగుతున్న శతావధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. శతావధాని గౌరీభట్ల మెట్రామశర్మ అవధానాన్ని సావధానంగా తిలకించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను అవధాని పూరించిన పద్యాలను ఆసక్తిగా విన్నారు. శతావధానం జరుగుతున్న సారస్వత పరిషత్ ప్రాంగణం సభికులతో కిక్కిరిసిపోయింది. కూర్చొనేందుకు సీట్లు సరిపోక పెద్ద సంఖ్యలో భాషాభిమానులు నిలుచునే అవధాన కార్యక్రమాన్ని తిలకించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తెలుగు మహాసభలకు తరలిరావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. చాలామంది జరుగదనుకున్న అద్భుతమిది అని వ్యాఖ్యానించారు. భాషాపండితులంతా కొలువైన ఈ సభలో తన గురువు మృత్యుంజయ శర్మ పక్కనే నిల్చొని ఆయన తనను తీర్చిదిద్దిన తీరు, విద్యార్థులకు గురువుల ఆవశ్యకతను గూర్చి కేసీఆర్ సభికులకు వివరించారు. శతావధాన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఈ మహాసభలు ఒక అద్భుత వేడుక
నేను పుట్టిన గడ్డలోనే పుట్టి శతావధాన ప్రక్రియను ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న మిత్రుడు మెట్రామశర్మ. ఇందులో పాల్గొంటున్న పృచ్ఛకులు, సహాయకులు, నిర్వాహకులందరికీ నా వందనాలు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకోసం జరిగిన చర్చోపచర్చల్లో సిధారెడ్డికి, నాకు వివాదం జరిగింది. మమ్మీ గిమ్మీల కాలం వచ్చింది. తెలుగు సాహిత్యం, పఠనం అంటే వస్తరో.. రారో? మీరు పెద్దగా పెడితే ఎట్లుంటదో అంటే.. మీరు నిరభ్యంతరంగా నిర్ణయం తీసుకోండి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు మహాసభలు దేదీప్యమానంగా, అద్భుతంగా జరుగుతాయని సిధారెడ్డిగారు చెప్పారు. దానికి నిదర్శనం ఈ జనాభిమానం. సమావేశ మందిరంలో పట్టక ఇబ్బంది పడుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, లాల్‌బహదుర్ స్టేడియంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నయి. సమావేశ మందిరాల్లో పట్టలేనంత మంది భాషాభిమానులు, సాహితీప్రియులు కూర్చున్నరు. నాకు గుండెల నిండుగ సంతోషంగా ఉన్నది.

గురువే మార్గదర్శి
ఒకప్పుడు నేను కూడా దారితప్పిన బాటసారినే! ఇప్పుడు ఈ దారిలో ఇంతవరకు వచ్చిన. చిన్నప్పుడు ప్రతిరోజూ ఐదున్నరకు ఠంచనుగా లేచి కాపుల ఇంట్లో పాలు తీసుకొని మా గురువుగారింటికి పోయి అమ్మగారికి ఇచ్చేవాడిని. వారు అప్పటికే లేచి, స్నానం చేసి, పూజాదికాలు పూర్తి చేసుకొని పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండేవారు. నా జీవితాన్ని ఆ సాహితీ సముద్రం యొక్క కవాటాలు తెరిచి నన్ను అందులోకి తోలుకొనిపోయినారు. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా ఆయన బోధించారు. మా నాన్న నువ్వు ఇంజినీరు కావాలి.. డాక్టర్ కావాలిరా అంటే నేను కానని చెప్పిన. అది వీరి ప్రభావమే.. అంత గొప్పగా నాకు చదువు చెప్పారు. ఆరోజుల్లో గురువులు అంత గొప్పగా ఉండేవారు.

తొలి తెలుగు మహాసభలు
కాలేజీ చదివేరోజుల్లో గంగారెడ్డిగారు ప్రిన్సిపాల్‌గా ఉన్నరు. అప్పట్లో లైబ్రరీలో చాలా అరుదైన పుస్తకాలుండేవి. ఖరీదైనవి. ఆ రిఫరెన్సు పుస్తకాలు లైబ్రేరియన్ ఇచ్చెటోడు కాదు. అప్పుడు మా ప్రిన్సిపాల్ వచ్చి వీడు ఏది అడిగితే అది ఇయ్యవయ్య. నేనిస్తా డబ్బులు అన్నారు. ఆయనకు అంతటి అభినివేశం ఉన్నది. 1974లో తొలి తెలుగు మహాసభల సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నరు. నేను, మిత్రుడు ఓంకార్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ స్థాయి పోటీల్లో గెలిచి ఇక్కడికి (హైదరాబాద్) వచ్చినం. మా ప్రిన్సిపాల్‌గారు మాతోపాటు అధ్యాపకుడు తంగిరాల సుబ్రహ్మణ్యశర్మను పంపారు. మేం రిఫరెన్సు పుస్తకాలు, బట్టలతో మొత్తం ఆరేడు బ్యాగులు, సంచులు తీసుకొని వచ్చాం. శర్మగారు ఒక సూట్‌కేసుతో వచ్చారు. మాకు మెథడిస్టు స్కూల్‌లో బస ఏర్పాట్లున్నాయి. ఆబిడ్స్‌లోని గ్రామర్‌స్కూల్‌కు దగ్గర రాత్రి 11.30గంటలకు బస్సు దిగినం. మేం సంచులు మోయలేకపోతుంటే మా గురువుగారు.. నాకు ఆ సంచులు ఇయ్యండి నాయనా నేనూ మోస్తానని తీసుకొన్నరు. ఆ సంచులు మోసుకొంటూ, ఈడ్చుకొంటూ పోతున్నం.

ధన్‌మంటూ.. నలభైయాభై మంది పోలీసులు వచ్చిండ్రు. కహాసే ఆయే అన్నరు. మేం ఊరి నుంచి ఇప్పుడే దిగినం అని చెప్పినం. కహా జా రహే హో అన్నడు పోలీసు. మా గురువుగారు విద్యార్థులకు పోటీలున్నయంటూ చెప్పిండు. సూట్‌కేస్ నీచే రఖో అన్నరు పోలీసులు. కింద పెట్టినం. ఆ తర్వాత ఉస్ మే క్యా హై? ఓ ఖోలో అన్నడు. మొత్తం తీసి పీకి పందిరేసినం. అప్పుడు ఒక కానిస్టేబుల్ మరో పోలీసు చెవిలో చెప్పిండు. సాబ్ కుచ్ బీ నహీ.. పూరే కితాబీ హై.. యే పాగల్ జైసా హై అన్నడు. మమ్మల్ని వదిలిపోయినరు. మేం పోలీసు అన్న మాటలకు నవ్వుకున్నం. రక్షకభటులు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. దీన్ని మనసులో పెట్టుకోకండి. పోటీ మీదనే దృష్టిపెట్టండని మా గురువుగారు చెప్పిండు. ఆయన మాకు చెప్పిండు కానీ తన మనసులోంచి ఆ బాధ పోవట్లేదు. ఈ ఘటన పోటీలో పాల్గొనే పిల్లల్ని ప్రభావితం చేస్తుందని ఆయన చాలా బాధపడ్డారు. మేం పోటీలో చిన్న బహుమతులను గెలుచుకున్నం. తర్వాత కాలేజీకి పోయినం. కాలేజీకి పోంగనే ఏం శర్మగారు పోటీలు ఎట్ల జరిగినయ్ అని ప్రిన్సిపాల్ గంగారెడ్డిగారు అడిగినరు. పోటీలు బాగానే జరిగాయండి. రక్షకభటులే దుర్మార్గంగా వ్యవహరించారండి అన్నారాయన. అట్ల జరుగకుంటే మనవాళ్లకు ప్రథమ, ద్వితీయ బహుమతులే వచ్చేవని ఆయనన్నరు.

శభాష్ సీఎస్..
ఈ మహాసభల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నా. 42 దేశాలు, 17 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కవులు, రచయితలు, పండితులు వస్తున్నరు. వారందరికీ భోజనాదుల భాధ్యతలు నేనే తీసుకుంటానని ఆయన ముందుకొచ్చారు. ఇది రాష్ట్ర గౌరవం కాబట్టి తానే పర్యవేక్షిస్తానన్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యదర్శి పదవిలో ఉన్నవాళ్లు ఇలాంటి బాధ్యతలు తీసుకోరు. అయినా ఆయన బాధ్యత తీసుకున్నరు. భోజనాలు అద్భుతంగా ఉన్నాయని నిన్న, ఈ రోజు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి గారికి అందరి తరఫున ధన్యవాదాలు.
మేం కార్యకర్తలుగా పనిచేస్తున్నాం
ఆనాటి గురువులు అంకితభావంతో, అనునయంతో, ఓపికతో నేర్పారు కాబట్టే నాలాంటివాళ్లు, నందిని సిధారెడ్డి లాంటివాళ్లు తయారయ్యారని, మేం ఇప్పుడు ఏ పదవుల్లో ఉన్నా, మళ్లీ కార్యకర్తలుగా పనిచేస్తున్నం. తెలుగు మహాసభల్లో శతావధానం చేస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ మేం పుట్టినగడ్డ నుంచే వచ్చారు. నాకు, సిధారెడ్డికి ఇది గర్వకారణం. మెట్రామశర్మగారు తెలుగు మహాసభలు విశ్వమంతా వ్యాపించే మహాప్రభలు అని అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. వారికి నా ధన్యవాదాలు. ఈ మహాసభలు నిర్విఘ్నంగా కొనసాగాలని, పూర్తిస్థాయి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్న. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంలో చాలా మంచి ప్రకటనలు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు భాషా ప్రియులు సంతోషించేలా, తెలుగు భాషకోసం పాటుపడేవాళ్లను ప్రత్యేకంగా ఆదుకోవడం కోసం ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నం. ఉత్తి మాటలు చెప్పడం కాకుండా, ఆచరణాత్మకంగా ముందుకుపోతామని తెలియజేస్తున్న అని కేసీఆర్ ఉపన్యాసం ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందినిసిధారెడ్డి, డాక్టర్ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బీ వెంకటేశం, సమన్వయకర్త శ్రీరంగాచార్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నెన్ని పద్యాలు చదివానో…!: సీఎం కేసీఆర్
సాహిత్యానికి, సాహితీ సృజన కోసం కృషి చేసేవారికి ఒకప్పుడున్న ఆదరణ మధ్యలో కొంత తగ్గింది. తెలంగాణలో రస స్ఫూర్తికి తక్కువ లేదు. రచించేవారు తక్కువేమీ లేరనేది ఈ తెలుగు మహాసభల సందర్భంగా రుజువవుతున్నది. నలభై ఏండ్ల కిత్రం చదువుకున్నపుడు ఎంత గొప్పగా చదివానో! నాకు సుమారు 3 వేల పద్యాలు కంఠతా వచ్చేవి. మధ్యరాత్రి లేపి మనుచరిత్రలోని ఫలానా పద్యం చెప్పమన్నా చెప్పేవాడిని.

(అంటూ వెంటనే పెద్దన రచించిన స్వారోచిష మను సంభవము లోని పద్యం అందుకున్నారు.)
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత జాలము శీతశైలమున్

(నందితిమ్మన రాసిన పారిజాతాపహరణంలోని మరోపద్యాన్నీ చదివారు)
నను భవదీయ దాసుని, మనంబున నెయ్యపు గిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు, మ
త్తను పులకాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే,
ననియెద, నల్క మానవు గదా, ఇకనైన నరాళ కుంతలా!
(సీఎం పద్యాలు చదువడంతో సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది.)

రమణ గారు మా అన్నగారు
సారస్వత పరిషత్‌లో జరుగుతున్న శతావధానాన్ని సభికుల్లో కూర్చుని కేసీఆర్ ఆసక్తిగా ఆలకించారు. ఆ తర్వాత వేదికపైకి ఆహ్వానించినప్పుడు ఆయన కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వేచి ఉన్నారు. సీఎంను మెట్లు ఎక్కమని ఆయన ఆహ్వానిస్తే లేదు. ముందు మీరే ఎక్కండంటూ కేసీఆర్ సూచించారు. నవ్వుతూ ముందుకు చేతులు చూపి రమణాచారి కేసీఆర్‌కు స్వాగతం పలికి, అయన్ని అనుసరించారు. వేదికపై ప్రసంగం మొదలుపెట్టే సందర్భంలో మా అన్నగారైన కేవీ రమణాచారి గారు ఉన్నారు. సాంకేతికంగా ఆయన ప్రభుత్వ సలహాదారు. కానీ నాకు సోదరసమానులు అని సీఎం అన్నారు.

వీనుల విందుగ.. కనులకు పండుగ
తెలుగు సాహిత్యంలో మణిలా ప్రకాశించే పద్యం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రభలా వెలిగిపోతున్నది. అష్టావధానాలు, శతావధానాలతో తెలుగు పద్యం మహాసభల వేదికలపై పరిమళిస్తున్నది. రవీంద్రభారతి, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న అవధానాలకు అభిమానం నీరాజనం పలుకుతున్నది. అవధానం పుట్టిన గడ్డపై ఈనాటికీ ఆదరణ తగ్గలేదని కిక్కిరిసిన సమావేశ మందిరాలే చాటుతున్నాయి. పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరిస్తూ శతావధాని పంచానన గౌరీభట్ల మెట్రామశర్మ పలికిన పద్యాలు సభికులకు ఆకట్టుకొన్నాయి. మెట్రామశర్మ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పలికిన పద్యం, తెలుగు మహాసభలపై ఆలపించిన గేయం సభికులను అలరించాయి.
పద్యం:
షీటీమ్స్ కల్పించి కేటుగాళ్లకు
దుమ్ము దులిపించి వనితకు ధృతిని పెంచి
సన్నబియ్యంతో అన్నదానం చేసి ఆహార భద్రతను ఆదరించి
ఆసరా పథకాన ఆశద్యుతులనించి కల్యాణలక్ష్మితో కాంతిపెంచి
మిషన్ భగీరథన్ మేలెంచి పాలించి
కాకతీయ మిషన్ కళలనించి
హరిత హారంబుతో నేలనలర చేసి
ప్రీతికోతలు లేని కరెంటునిచ్చి
జనము నీరాజనము పలక ఘనకృతిమెయి
మన తెలంగాణ ప్రభుతయే మాన్య చరిత

గేయం:
తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
బాసరపురి బాసతల్లి భాసురముగ దీవింపగ
కీసరగిరి రామలింగస్వామి కరుణ కురిపించగ
యాదశైల నృసింహుడు లాదమునే పంచుచుండ
ఆలంపూర జోగులాంబ అలంకారమై నిలువగా

తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు

నగరం నందనవనమై నవనవమై నర్తింపగ
పలుకుబడుల సొమ్ముతో ప్రకృతి మాట పులకించగ
మన సంస్కృతీ సౌరభాలు మహినంత వ్యాపించగా

తెలంగాణా నేల వెలుగు తెలుగు మహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు

మారన మల్లియరేచన మల్లినాథ ధర్మన్నలు
పోతన తెలుగన భళీ పాలకురికి సోమన్న యు
కాళోజీ సినారేలు కరములెత్తి దీవింపగా

తెలంగాణా నేల వెలుగు తెలుగు మహాసభలు
తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు

ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల మేటి
కేసీఆర్ కళాహృదయం కేతనమై నూతనమై
జయశంకర శ్రీకరాత్మ జయమంత్రము నందింపగ

తెలంగాణా నేల వెలుగు తెలుగు మహాసభలు
తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kcr-speech-at-prapancha-telugu-mahasabhalu-2017-1-2-562386.html