లోటు రానివ్వొద్దు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

లోటు రానివ్వొద్దు

ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మహాసభలకు ప్రతి సాహిత్యాభిలాషి హాజరుకావొచ్చన్న సందేశం వెళ్లాలని సీఎం చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా సాహిత్యం, భాష ప్రాధాన్యంగా జరుగాలని, ప్రధాన వేదిక అయిన లాల్‌బహదూర్‌శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన ఐదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలపాటు ప్రగతిభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని చెప్పారు.

నూటికి నూరు శాతం ఆహ్వానితులను తగురీతిలో గౌరవించాలని, సౌకర్యాలు కలిగించాలని అన్నారు. 13 గుర్తింపు పొందిన భారతీయ భాషల్లో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలను వివిధ రాష్ర్టాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించి తగురీతిలో సత్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంతమంది ఇతర భాషల వారికి సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహాసభల సందర్భంగా మనకు దక్కాలని అన్నారు. ప్రధాన ఘట్టాలైన ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాల విషయంలో నిర్ణయాత్మకంగా, నిర్ణీతంగా ఉండాలని, ఇదొక బహుముఖమైన కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వస్తున్నారని, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఉభయ తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశిష్ట అతిథులుగా వస్తున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ ప్రకటన ఉపరాష్ట్రపతి చేయగానే పెద్ద ఎత్తున పటాకులు కాల్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ వస్తున్నారని తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వివిధ దేశాలు, పొరుగు రాష్ర్టాలనుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారో ఆరా తీశారు. మొత్తం సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నట్టు వారు సీఎంకు తెలిపారు.

ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో సహా అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలని, భోజనాలు, బస, ఇతర లాజిస్టిక్స్ తదితరాల్లో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాలని సీఎం చెప్పారు. వివిధ వేదికల వద్ద జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులు అక్కడికి చేరుకోవటానికి, ఆ తరువాత సాయంత్రం పూట ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం చేరుకోవటానికి తగిన సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రతి ప్రతినిధితో మాట్లాడి, వారి అభిలాష కనుక్కుని, దానికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడికి వెళతారో ఆ విధంగానే రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల ప్రారంభానికి గంట ముందుగానే ఇతర వేదికల వద్ద కార్యక్రమాలు ముగిసేలా చూడాలని అన్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ప్రతిరోజు తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరుగాలని సీఎం అన్నారు. విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ వేదికల వద్ద జరిగే సభలకు హాజరవుతారో వివరాలు రూపొందించి, దానికి అనుగుణంగానే సౌకర్యాలు కలిగించాలని సీఎం చెప్పారు. విదేశీ ప్రతినిధులకు రవాణాకు కార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎల్బీ స్టేడియంకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, ఇతర సాహిత్యాభిలాషులు హాజరవుతారు కాబట్టి పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే సభల ప్రారంభం నాటి నుంచే ఫుడ్ కోర్ట్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు.

అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటిచెప్పాలని, ఐదు రోజుల్లో ఒకనాడు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. వివిధ జిల్లాలనుంచి తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఆచార్యులు, వివిధ రచయితల సంఘాల సభ్యులు, తెలుగులో పాండిత్యం ఉన్న ఇతరులు, సాహిత్యాభిలాషులు మహాసభలకు హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్లు రవాణా, భోజన సౌకర్యం కలిగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సాహిత్యాభిలాష ఉన్న వారు సభలకు హాజరయ్యేందుకు వీలుగా సౌకర్యం కలిగించాలన్నారు. అభిలాష ఉండి మహాసభలకు హాజరుకాదలుచుకున్న వారందరికీ వచ్చే వెసులుబాటు కల్పించాలని చెప్పారు.

CM KCR along with cabinet sub committee taking stock of World Telugu Conferences 2017 arrangements - Image 2

మొత్తంగా ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలని అన్నారు. ప్రారంభ, ముగింపు సమావేశాలు జరుగుతున్న ఎల్బీస్టేడియంలో విదేశీ, ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు ప్రత్యేక సీటింగ్ అరెంజ్‌మెంట్ ఉండాలని సూచించారు. నమోదు చేసుకున్న ఇతర ప్రతినిధులకు, మహిళలకు, వివిధ సాహిత్య వేదికల్లో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేవారికి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు విడివిడిగా ఎన్‌క్లోజర్లు ఉండాలన్నారు. ప్రెస్ గ్యాలరీ ఏర్పాటుచేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, టీ హరీశ్‌రావు, చందూలాల్, ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, రోడ్లు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kcr-reviews-arrangements-for-telugu-conference-1-2-561903.html