మన సంస్కృతి ఉట్టిపడాలి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మన సంస్కృతి ఉట్టిపడాలి

kcr-about-world-conferences-arrangementతెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లుండాలని, ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరగనున్న మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్‌ సోమవారమిక్కడ ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో నియమించిన ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్‌, తు మ్మల నాగేశ్వరరావు, చందూలాల్‌ సభ్యులుగా ఉంటారు.

ఎల్బీ స్టేడియంలో పరిశీలించిన సీఎం..
ప్రగతి భవన్‌లో సమీక్ష ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ప్రధాన వేదికైన ఎల్బీ ేస్టడియానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం లోపల, వెలుపల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్టేడియంలోపలే ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసి అతిఽథులకు తెలంగాణ వంటకాలు వడ్డించాలన్నారు.

సభా వేదిక చుట్టుపక్కల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించి అంశాలను ప్రదర్శించేలా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎల్బీ స్టేడియంలో పుస్తకాల స్టాల్స్‌, హస్తకళల ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సభకు ఉప రాష్ట్రపతి, ముగింపు సభలకు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. మహాసభలు నిర్వహించనున్న ఐదు రోజుల్లో ఒక రోజు తెలుగు సినీ గేయాలకు సంబంధించి కార్యక్రమం నిర్వహించాలన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

యాదగిరీశుడి సంకీర్తనలతో పుస్తకం
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు రాసిన పుస్తకాలు, రచనలను వెలుగులోకి తెచ్చేందుకు మహాసభల నిర్వహణ కోర్‌ కమిటీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు 100కు పైగా పుస్తకాలను ముద్రించేందుకు రంగం సిద్ధం చేసింది. యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిపై సుమారు 40ఏళ్ల క్రితం ఈగ బుచ్చయ్య రాసిన సంకీర్తనలను పుస్తకరూపంలోకి తీసుకురానున్నారు. వట్టికోట అళ్వార్‌స్వామి, మాడపాటి హనుమంతరావు, భాగ్యరెడ్డి వర్మ వంటి ప్రముఖుల రచనలనూ తెలుగు అకాడమీ ముద్రిస్తోంది. తెలంగాణ సినీగేయాల ప్రస్థానంపై కందికొండ రాసిన రచనలను పుస్తక రూపంలో తేనున్నారు. పద్యకవితా ప్రస్థానంపై గండ్ర లక్ష్మణ్‌రావు రాసిన పుస్తకాన్ని ముద్రించనున్నారు. చైతన్యప్రకాశ్‌ సేకరించిన 6 వేల తెలంగాణ సామెతలకూ పుస్తక రూపం ఇవ్వనున్నారు. అయోధ్యారెడ్డి, శారద, బీవీఎన్‌ స్వామి సంపాదకులుగా 70 తెలంగాణ కథలను ఎంపిక చేసి ప్రత్యేక పుస్తకాన్ని ముద్రిస్తున్నారు.

కాసుల ప్రతా్‌పరెడ్డి రచిస్తున్న తెలంగాణ నవలా వికాసం, శివనాగిరెడ్డి రాసిన ‘తెలంగాణలో శాతవాహనులు’ అనే అంశాలను పుస్తకాలుగా ముద్రిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ 7 పుస్తకాలను ముద్రించే బాధ్యతలు తీసుకుంది. నిజాం సంస్థానంలో పనిచేసిన ముదిరాజు రామకోటేశ్వరరావు స్వీయ చరిత్రనూ పుస్తకం వేస్తున్నారు.
అమ్మా నీకెంత జీతం ఇస్తున్నారు?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న సందర్భంగా ఒక మహిళ పనుల్లో నిమగ్నమై ఉంది. ఆమెను గమనించిన సీఎం.. ‘అమ్మా నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగారు. ‘సార్‌ నేను క్రీడాశాఖలో పని చేస్తున్నా’ అని ఆమె సమాధానమిచ్చింది. నీకెంత జీతం ఇస్తున్నారని కేసీఆర్‌ అడగ్గా.. వెంటనే అధికారులు స్పందించారు. ఆమె ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నదని, వారికి చెల్లిస్తున్న వేతనమే ఆమెకూ ఇస్తున్నట్లు చెప్పారు.

Source: http://www.andhrajyothy.com/artical?SID=501569