సాహిత్యంలో కరీంనగరం - World Telugu Conferences - 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహిత్యంలో కరీంనగరం

తొలి తెలుగు కందపుద్యం పుట్టింది ఈ నెలపైనే.. తొలి తెలుగు రాజధాని కోటిలింగాల ఇక్కడే.. భాగవతాన్ని తెలుగు లోకి అనువదించిన వెలగందుల నారయ.. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. విశ్వంభర సృష్టికర్త.. తెలుగుజాతి గర్వించేలా గేయ సాహిత్య రూపంలో తెలుగు వెలుగులు ప్రసరింపచేసిన డాక్టర్ సీ నారాయణరెడ్డి, అష్టభాషా కోవిదుడు, పాలనాదక్షుడు.. సాహితీవేత్త పీవీ నరసింహరావు అవిభక్త కరీంనగర్ జిల్లా బిడ్డలే. పీవీ తెలంగాణ భాషలో రాసిన గొల్ల రామవ్వ కథ సుప్రసిద్ధం. నైజాం రాష్ట్ర తొలి శతావధాని సిరిసినహల్ కృష్ణమాచార్య, అక్షరాల ఫిరంగులతో యువతకు కొత్తచూపు నిచ్చిన అలిశెట్టి, తెలంగాణ వేమనగా పేరు గాంచిన వరకవిసిద్ధప్ప, బహుభాషా వేత్త.. తెలంగాణ పదకోశ రచయిత.. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్, శతాధిక గ్రంథ కర్త.. కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్రను గ్రంథరూపంలో తెచ్చిన డాక్టర్ మలయశ్రీ, కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతి వెలుగులోకి తెచ్చిన జైశెట్టి రమణయ్య ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలే. వేములవాడ, ధర్మపురి, మంథని సంస్కృత, తెలుగు సంప్రదాయ సాహిత్యాల కేంద్రాలుగా భాసిల్లాయి. విప్లవోద్యమ సాహిత్యానికి, క్రియాశీలక ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ ఇది. వెయ్యేండ్ల తెలుగు సాహితీ మహాస్రవంతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక పెద్దపాయ. ఒక్క మాటలోచెప్పాలంటే ఈ గడ్డపై పుట్టిన ఎంతోమంది బిడ్డలు తెలుగు సాహిత్యాన్ని, అందులోని మాధుర్యాన్ని నలుదిశలా చాటి చెప్పారు. నాటి రాజుల కాలంలో ఎంతో మంది కవులు విశిష్ట గ్రంథాలకు సృష్టికర్తలు కాగా.. నేటికాలంలో జ్ఞానపీఠ అవార్డు నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరకు అందుకున్నారు.

రాజులకాలంలో తెలుగువెలుగు
కరీంనగర్ జిల్లాలో తొలి తెలుగు పద్యకవిత వేములవాడ జిన వల్లభుని కందపద్యాలతో క్రీ.శ. 946లో ఆరంభం అయినట్టు చారిత్రక అధారాలు కనిపిస్తున్నాయి. 14వ శతాబ్దిలో మడికి సింగనకవి, 15వ శతాబ్దిలో వెలిగందుల నారయ, 16వ శతాబ్దిలో చరికొండ ధర్మన తెలుగు కావ్య నిర్మాతలు. వేములవాడ భీమకవి కూడ ఇక్కడివాడే అని ప్రతీతి. ఇరవయ్యో శతాబ్దిలో జిల్లాలో అపారంగా సాహితీ సృష్టి జరిగింది. అఖిలభారత ఖ్యాతి ఆర్జించిన కవులు, రచయితలు అనేకమంది ఇక్కడినుంచి వచ్చారు. ఇక్కడివాడుగా గుర్తించిన భీమకవి గ్రంథాలను శ్రీనాథునివంటి కవులు కీర్తించారు. సోమనాథుడు రచించిన వసుచరిత్రవ్యాఖ్య జిల్లా నుంచి వచ్చిన తొలి వచనగ్రంథం.
bommalamma-gutta
ఎల్లలు దాటిన కవులు
ఈ ప్రాంతం మొదటి నుంచి కవి పండితులకు నిలయం. రాజుల కాలంలోనే కాదు.. తదుపరి ఎంతోమంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు తెలుగు ప్రాధాన్యతను నలుదిశలా చాటిచెప్పారు. అలాంటి వారిలో మచ్చుకు కొంత మందిని చూస్తే.. అష్టభాషా కోవిదుడు, మేధావి, పాలనాదక్షుడు, దేశ మాజీప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్, పద్మశ్రీ డాక్టర్ సీ నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్, మామిడిపల్లి సాంబశివశర్మ, శతావధాని సిరిసినపాల్ కృష్ణమాచార్యులు, వేంకటరాజన్న అవధాని, సేనాపతి రాఘావాచార్య, యశోదా తిర్మల్‌రెడ్డి, డాక్టర్ వీ కొండల్‌రావు, డాక్టర్ జే బాపురెడ్డి, అచ్చి వెంకటాచార్యులు, డాక్టర్ అందె వెంకటరాజం, నల్లాన్ చక్రవర్తుల వేదాంతాచార్యులు, పార్వేల గోపాలకృష్ణ, పింగళి లింబాద్రిరెడ్డి, వెలిచాల కేశవరావు, జువ్వాడి గౌతంరావు, డాక్టర్ రాజన్నశాస్త్రి, ముద్దసాని రాంరెడ్డి, గర్రెపల్లి సత్యనారాయణరాజు, కే మల్లికార్జున్, మహ్మద్‌అలీ, తాడిగిరి పోతరాజు, జీ సురమౌళి, డాక్టర్ మలయశ్రీ, వడ్డేపల్లి కృష్ణ, దశరథ్, దూడం నాంపల్లి, చొప్పకట్ల చంద్రమౌళి, గాదె శంకర కవి, కవి గణపతి రాంచంద్రారావు, డాక్టర్ ముదిగంటి సుజాతా గోపాల్‌రెడ్డి, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ రావికంటి వసునందన్, అల్లం రాజయ్య, సాహూ వెంకటేశ్వర్లు, బీఎస్ రాములు, డాక్టర్ కాలువ మల్లయ్య, కేవీ నరేందర్ వంటి అనేక మంది సాహితీరంగంలో పేరుపొందారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/karimnagar-dis-specializes-in-the-millennia-of-telugu-literature-1-2-562052.html