తెలంగాణ ఘనతను చాటే సభలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ ఘనతను చాటే సభలు

ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే తెలుగుకు పెద్దపీట వేస్తున్నదనేది వాస్తవమని బహుభాషావేత్త, కేంద్రసాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరి చేయడం ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల భాషాకమిటీలో సభ్యుడైన నలిమెల భాస్కర్ తెలుగుభాష అభ్యున్నతిపై తన అభిప్రాయాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష ప్రముఖంగా చర్చకు వస్తున్నది. ఎందువల్ల?
అవును.. తప్పనిసరిగా మాట్లాడుకోవల్సిన అవసరం ఉన్నది. తెలంగాణం అంటే తెలుగు ప్రజలకు చిరకాలం నుంచి ఒక శాశ్వత నివాస స్థానమని ఇక్కడి ప్రజలు వలస వచ్చినవారు కాదని పెద్దలు ధూపాటి వెంకటరమణాచార్యులు ఏనాడో చెప్పారు. తెలంగాణం అంటే తెలుంగు ఆణం అంటే తెలుగు స్థానం.. తెలుగు భాషకు పుట్టినిల్లు అని దానర్థం.

తెలుగుకు తెలంగాణమే పుట్టినిల్లు అని మీ భావనా?
అవును. సందేహం లేదు. తెలుగు అనే పదాన్ని స్ఫురింపజేసే సూచన తెలంగాణం అనే మాటలో ఉంది. ఇప్పటికీ మహా ప్రాణాక్షరాల ఉచ్చారణ లేని వందలువేల పదాలు తెలంగాణలో వినిపిస్తాయి.

గత ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సాహిత్యానికి, సాహితీవేత్తలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని మీరు భావిస్తున్నారా?
ఇదివరకటి ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సాహిత్యానికి, సాహితీవేత్తలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నది యధార్థం. తెలుగుభాష అమలు కోసం ఆ సభల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా ఆచరణలో విఫలమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ సభలు నిర్వహిస్తుండడం సంతోషించదగ్గ విషయం. తెలుగు సభలు అనడం కన్న ప్రపంచ తెలంగాణ సభలు అంటే స్వస్థాన వేషభాషలకు మరింత ఊతం దొరికినట్టుండేది.

ఇప్పుడు జరుగబోయే మహాసభలు ఏయే అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి?
అపురూపమైన ప్రాచీన సాహిత్యాన్ని భవిష్యత్ తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలపై ఏడాదికోసారి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు తెలుగును తప్పనిసరిగా చదువాలనే నిర్ణయం చాలా మంచిది. ఇది సాధ్యమైనంత తొందరగా ఆచరణలోకి తేవాలి. తెలుగులో చదివినవారికి విద్యా, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తేనే భాష బతుకుతుంది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/interview-with-writer-nalimela-bhaskar-1-2-561876.html