ఒగ్గుకథకు నిగ్గు తెచ్చిన మిద్దె రాములు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ఒగ్గుకథకు నిగ్గు తెచ్చిన మిద్దె రాములు

పల్లెపదాలతో.. తెలంగాణ యాసతో గజ్జెకట్టి ఆడి ప్రపంచానికి ఒగ్గుకథ ప్రాముఖ్యాన్ని, దాంతోపాటే తెలుగు భాష తీయదనాన్ని తెలియజేశారు మిద్దెరాములు. పల్లెపదాలతో రాములు ఒగ్గుకథ చెప్తుంటే పల్లెలు చెవియొగ్గి వింటాయి. ప్రపంచానికి ఒగ్గుకథ అంటే ఏమిటో తెలియజేసింది ఆయనే. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊళ్లో కథ చెబుతాడో ఆ ఊరికి కొత్తకళ వస్తుంది. గొర్రెల పెంపకం వృత్తిగా ఉండే గొల్లకుర్మలు తమ కుల పురుషుడు బీరప్ప కథను ప్రచారం చేసేందుకు ఒగ్గుకథను ప్రారంభించినట్టు చెప్పుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన మిద్దె రాములు గొల్ల-కుర్మ కులస్తుడు కాకపోయినా ఒగ్గుకథకు అంకితమయ్యారు. ఒగ్గుకథకు పితామహుడిగా మన్ననలు పొందారు. నేటితరం కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. 1942లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామంలో జన్మించిన మిద్దె రాములు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడు. చిన్ననాటి నుంచే ఒగ్గుకథపై మమకారం పెంచుకున్న మిద్దెరాములు స్వయంకృషితో ఒగ్గుకథను ఆకళింపు చేసుకున్నారు. ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టారు. గీతకార్మిక కుటుంబంలో పుట్టిన రాములు ప్రపంచవ్యాప్తంగా ఒగ్గుకథ ప్రదర్శనలిచ్చి తన ప్రతిభను చాటుకున్నారు.
Default post image
50 ఏండ్లుగా ఒగ్గుకథ ప్రయాణం
తెలంగాణ వాడుకభాషలో 50 ఏండ్లుగా ఒకే బృందంతో డోలు, తాళం, జగ్గు, కంజర వాయిద్యాలు మోగింపజేస్తూ ఎల్లమ్మకథ, బాలనాగమ్మకథ, దేశింగురాజు కథ, సారంగధరకథ, గంగగౌరీ, ఐదు మల్లెపూల కథలను ఒగ్గుకథలుగా చెప్పారు మిద్దె రాములు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇక్కడి ప్రజల భాషతో సాగే ఈ కథల మధ్యలో జానపద గేయాల్ని ఆలపిస్తూ, హాస్య వ్యంగ్యోక్తులు వేస్తూ కథను రసవత్తంగా రక్తికట్టించడం రాములు అలవర్చుకున్న కళ. నిరక్షరాస్యుడైన రాములుకు తెలంగాణ భాష, పౌరాణిక గాథలపై మంచి పట్టుండేది. ప్రాచీన పురాణాలు, చారిత్రక గాథలే కాకుండా తన కథ ద్వారా సామాజిక చైతన్యాన్ని రేకెత్తించే విధంగా కథలు చెప్పడం మిద్దెరాములు ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం లో బోనం నృత్యంతో ఉర్రుతలూగించారు.
అపురూపం బోనం నాట్యం
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం గ్రామదేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకుని వడివడిగా నడువగలడం నేర్పుతో కూడిన ఘట్టం. ఈ పక్రియను తన జానపద కళారూపంగా మలుచుకున్నారు మిద్దె రాములు. ఒగ్గుకథ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆయన అలవోకగా బోనం ప్రదర్శన ఇచ్చేవారు. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతి ఆరకుండా బోనంతో సహా నేలపై పడుకుని రూపాయి నాణాన్ని నోటితో తీసే ఘట్టం ప్రేక్షకులను తన్మయత్వానికి గురిచేసేది. అలాగే బోనం తలపైన పెట్టుకోని నృత్యం చేయడం, ఎగురుతూ పొర్లుదండాలు చేసే ఘటన చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. హైదరాబాద్ భాగమతి మైదానంలో జరిగిన తెలంగాణ ఉద్యమ సభలో మిద్దెరాములు ఎత్తిన బోనం ధూంధాం వేదికను ఉర్రూతలూగించింది. ఉద్యమ కెరటమై నిలిచింది. 1990లో మారిషస్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో ఆయన ఒగ్గుకథ వినిపించారు. 2010 నవంబర్ 25న ఆయన కన్నుమూశారు. ఒగ్గుకథ ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందనడంలో సందేహం లేదు.