తెలంగాణ కవులకు గుర్తింపేది? | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ కవులకు గుర్తింపేది?

Importance of Telangana Poets
తెలంగాణ తెలుగును మేం పంచుతాం.. పోతనే కాదు.. సూరన, మారన, సింగన మనవారే
ఏది నిజమైన చరిత్ర? ఏది వక్రీకరించిన చరిత్ర?
విద్యార్థులకు, పరిశోధకులకు తెలియాలి
ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశం ఇదే
‘ఆంధ్రజ్యోతి’తో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

తెలంగాణలో తెలుగు పరిపుష్టిగా లేదనే అభిప్రాయం ఉందని, అయితే ఇది నిజం కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు సుగంధాలు, ఇక్కడి ప్రాచీన,ఆధునిక కవులు, రచయితల పరంగా మరుగున పడివున్న ఎన్నో చారిత్రక వాస్తవాలను ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రపంచానికి చాటుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పరిఢవిల్లిన సాహిత్య వికాసం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్లందరికీ చాటి చెప్పేందుకు ప్రభుత్వం.. ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ నిర్వహించాలని సంకల్పించిందని ఆయన చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయాన్ని ప్రపంచానికి చెబితే.. విద్యార్థులకు, పరిశోధకులకు ఏది నిజమైన చరిత్ర, ఏది వక్రీకరణకు గురైన చరిత్ర? అనే విషయాలపై అవగాహన వస్తుందన్నారు. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ, సందర్భంపై రమణాచారి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘అధిక విద్యావంతులు అప్రయోజకులైరి
పరమశుంఠలు సభా పూజ్యులైరి..
వదురుబోతుల మాట వాసికెక్కె.. ’’

ఇలాంటి పద్యాలను అందించిన ధర్మపురి శేషప్ప కవి మన తెలంగాణ వాడే! అద్భుతమైన శతకాన్ని రాసిన శేషప్ప గురించి ఎంతమందికి తెలుసు? ఈయనొక్కరే కాదు తెలంగాణలోని సుప్రసిద్ధ కవుల్లో చాలామందికి గుర్తింపు రాలేదు. పోతన, సోమన, గౌరన, మారన, మడికెసింగన, ఎలగంద నారయ, గోన బుద్ధారెడ్డి లాంటివారు తెలంగాణ కవులే! పోతన మినహా మిగతా వారు ఈ ప్రాంతానికి చెందినవారనే ప్రచారం లేదు. కరీంనగర్‌ జిల్లాలోని ఎలగందలలోని నారయ భాగవతం పూరించడానికి తోడ్పడ్డాడు. ‘సింహాసన ద్వాత్రింశక’ అనే మొట్టమొదటి కథా సంకలనాన్ని అందించిన కొరవి గోపరాజు నిజామాబాద్‌ జిల్లా వాడన్న సంగతి చాలామందికి తెలీదు. బమ్మెర పోతన వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు కాదన్నట్టు గా వాదించారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక ద్వారా 1934లోనే తెలుగు కవులను తెలుగువారికి పరిచయంచేశారు.

తెలంగాణ గొప్ప ఆధునిక కవులకూ పుట్టిల్లు. ఇక్కడివారిలో దాశరథి, సినారె, కాళోజీలాంటి వాళ్లుమాత్రమే ప్రపంచానికి తెలుసు. జగన్నాథాచార్యులు, వానమాములై వరదాచార్యులు, కృష్ణ మాచార్యులు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు లాంటి లబ్ధప్రతిష్టులైన ఇక్కడి కవులను మనం తలచుకోవడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక నిఘంటువు ఏర్పాటు, తెలంగాణ, తెలు గు భాషపట్ల అవగాహన, తెలంగాణలోని ప్రసిద్ధులను పరిచయం చేయడం వంటివి చేస్తాం.

శాతవాహనుల తొలి రాజధాని ఇక్కడే.. కందమూ మనదే!
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో శాతవాహనుల తొలిరాజధాని అమరావతిలోని ధాన్యకటకం అన్నారు. నిజానికి శాతవాహనుల మొదటి రాజధాని కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల. మహారాష్ట్రలోని ప్రతిష్ఠానుపురం రెండో రాజధానిగా ఉండేది. ఆ తర్వాతే శాతవాహనులు ధాన్యకటకం, అమరావతికి వెళ్లారు. ఇప్పటి విద్యార్థులకు ఈచరిత్ర చెప్పాప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే కంద పద్యం పుట్టింది తెలంగాణలోనే. 1500 సంవత్సరాల పూర్వం కరీంనగర్‌ జిల్లా బొమ్మలగుట్ట దగ్గర్లోని కుడిక్యాల శాసనం ద్వారా ఇది స్పష్టమవుతోంది. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా సభల్లో చర్చకు పెడతాం.

తొలి తెలుగు స్వతంత్ర కావ్యం మనదే
ఆదికవిగా నన్నయ్య అని రూఢీగా ఉంది. అయితే, పాలనా అనుభవం ఉన్నవ్యక్తిగా, తెలుగు భాషాభిమానిగా, పరిశోధకునిగా ఒక విషయం చెప్పదలిచాను! ఆదికవిఎవరు? అనే ప్రశ్నకన్నా తెలుగులో మొట్టమొదటగా వచ్చిన స్వతంత్రకావ్యం ఎవరిది? అన్నప్పుడు పాల్కుర్కి సోమన అనే జవాబొస్తుంది. అయినా నన్నయ్య, తిక్కన, ఎర్రన ప్రతిభనే ప్రపంచం గుర్తించింది. కవులు, కళాకారులు ఒక ప్రాంతం, భాషకు మాత్రమే పరిమితం కారు. షేక్‌స్పియర్‌, జాన్‌ కీట్స్‌ వంటి కవులు ప్రాంతాలు, దేశాలకు అతీతంగా గుర్తింపు పొం దారు. హిందీ కవి మైథిలీ శరణ్‌ గుప్తాను ఉత్తరాదివారే కాదు.. దక్షిణాదివారూ అదరించారు. కబీర్‌దాస్‌, త్యాగరాజు కూడా. కవులు కళాకారులు ఒక ప్రాంతానికే పరిమితం కానప్పటికీ.. వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఆయా ప్రాంతాలపైనే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంది.

మా భాష.. మా వ్యవహారం
తెలంగాణలో తెలుగు పరిపుష్టంగా లేదనే అభిప్రాయం ఉంది. అం దుకే తెలుగువారందరం ఒకచోట కలిసి ప్రపంచంలోని తెలుగువారందరికీ ‘‘తెలంగాణలో ఇది మా భాష, మా వ్యవహరం’’ అని చెపాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మాతృభాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్య లు తీసుకోవాలి? అందులో ఉన్న అడ్డంకులేమిటి? తెలుగు భాషపై పిల్లల్లో ఆసక్తినికలిగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలను సభల్లో చర్చిస్తాం. మాతృభాషా పరిరక్షణ చర్యల్లో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. మాతృభాషపై పట్టు ఉన్నవారే ఇంగ్లిషు, ఫ్రెంచ్‌ లాంటి పరాయి భాషలపై ఎక్కువ పట్టు సాధించగలరు. అందుకే మాతృభాష పరిరక్షణ కోసం దేశ, విదేశాల వాళ్లతో మాట్లాడి తెలుగు మహా సభల్లో తీర్మానం చేసుకోవాలని నిర్ణయించాం.

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో జరుగుతా యి. మహాసభల్లో లాల్‌ బహదూర్‌ స్టేడియం ప్రధాన వేదిక. రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం లాంటి ఇతర వేదికలనూ ఉపయోగించుకుంటాం. వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్‌, మారిషస్‌ నుంచి చాలా మంది సాహితీ మిత్రులు ప్రపంచతెలుగు మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలు విజయవంతమైతే తెలంగాణ విద్యార్థులు, సాహితీ లోకానికి గొప్ప మార్గదర్శకత్వం లభిస్తుంది.

Source: http://www.andhrajyothy.com/artical?SID=496307