మధుర భాష తెలుగు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మధుర భాష తెలుగు!

Narasimhanతెలుగుభాష ఎంతో మధురమైందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తెలుగు బడి పలుకుల భాష.. పలుకుబడుల భాష.. అమ్మ భాష..ఆ మాధుర్యం తెలుగుభాషకే ఉన్నదని పేర్కొన్నారు. నవోదయం..తెలుగుకు శుభోదయం అంటూ ప్రపంచ తెలుగు మహాసభల్లో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన గవర్నర్ ఇంత గొప్ప సభల్లో పాలుపంచుకోవడం తనకెంతో సం తోషాన్ని కలిగించిందని అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు చూస్తుంటే గుండెలనిండుగా పండుగ జరుపుకుంటున్నట్లు ఉందని చెప్పారు. తెలంగాణలో తంగేడుపూవు నవ్వి నా, కోన సీమలో కొబ్బరి మురిసినా, రాయలసీమలో రాలుగాయి నవ్వినా తెలుగు కవిత్వం పుడుతుందన్నారు. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు.. తెలుగు నేనే.. వెలుగు నేనే.. అలుగు నేనే.. పలుగు నేనే.. తేట తెలుగు నేనే.. అని కవిత్వం చదివి వినిపించారు. ఆదికవి నన్నయ్య మొదలుకొని ఈ తరం కవి సీ నారాయణరెడ్డి వరకు అందరు కవులు ఈ మహాసభల వేదికపై ముందు వరుసలో కూర్చొని భువనవిజయం జరుపుకున్నట్లుగా ఉన్నదన్నారు. కాళోజీ, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయులను స్మరించుకునే సందర్భం రావడం మనందరి అదృష్టంగా భావించాలని గవర్నర్ చెప్పారు. అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య, కృష్ణమాచార్య వంటి సంకీర్తనాచార్యుల వైభవాన్ని చాటే విధంగా తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పద్యం, పాట, వచనం, కథ, హరికథ, నవల, బుర్రకథ ఏ ప్రక్రియలైనా మన సాహిత్య వైభవాన్ని చాటి చెప్తాయని తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా పనిచేస్తూ తాను కూడా తెలుగువాడిగా మారానని, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తనకెంతో మధురమైన అనుభూతి కలిగించిందని గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు అజరామరంగా నిలువాలని, అమ్మభాషకు ప్రాధాన్యమిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/governor-narasimhan-speech-at-world-telugu-conference-1-2-562242.html