సాహిత్య పోషణకు ప్రభుత్వం పెద్దపీట - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహిత్య పోషణకు ప్రభుత్వం పెద్దపీట

laxmareddy

తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, సాహిత్య పోషణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. అభివృద్ధితోపాటు సాహిత్య, సాంస్కృతిక అంశాలకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజైన ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం శ్రీ బిరుదురాజు రామరాజు ప్రాంగణం, సామల సదాశివ వేదికపై నిర్వహించిన కథా సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలంగాణలో ఎందరో మహనీయులు ఉన్నారని, వారందరినీ ఈ మహాసభలు వెలుగులోకి తెస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కథా వైభవాన్ని ఈ తరానికి తెలియజేయడం కోసం కథా సదస్సు నిర్వహిస్తున్నామని ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. వివిధ అంశాలపై సాహిత్య చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్, రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌కుమార్, డాక్టర్ వెల్దండి శ్రీధర్, నవ్య వారపత్రిక సంపాదకుడు ఏఎన్ జగన్నాథశర్మ, చరిత్రకారుడు విరివెంటి గోపాలకృష్ణ మాట్లాడారు. అనంతరం ప్రముఖ కవి శీలా వీర్రాజు, చరిత్రకారుడు గోపాలకృష్ణను మంత్రి లకా్ష్మరెడ్డి సన్మానించారు.
నాడు సురవరం.. నేడు కేసీఆర్
తెలంగాణ ప్రాంతంలో కవులు లేరన్నందుకు నాడు సురవరం ప్రతాప్‌రెడ్డి గోల్కొండ కవుల సంచిక తీసుకొస్తే.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటేందుకు నేడు సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని అటవీశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సామల సదాశివ వేదికపై తెలంగాణ నవలా సాహిత్యంపై నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో కథ, నవలా రచన కూడా ఉండాలని ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి గటిక విజయ్‌కుమార్ చెప్పారు. నవలా సాహిత్యం గురించి కాసుల ప్రతాపరెడ్డి, వసంతరావు దేశపాండే, ఆడెపు లక్ష్మీపతి ప్రసంగించారు. అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రచయితలు పోల్కంపల్లి శాంతాదేవి, దేవులపల్లి కృష్ణమూర్తి, గటిక విజయ్‌కుమార్‌లను సన్మానించారు. ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్ తదితరులు హాజరయ్యారు.

సుప్రసిద్ధ కథకుడు కాళీపట్నం రామారావుకు ఘన సత్కారం
గ్రంథాలయాల స్థాపన ద్వారానే సాహిత్యానికి ఆదరణ, సాహితీవేత్తలకు గౌరవం దక్కుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సామల సదాశివ వేదికపై ఆదివారం రాత్రి రచయిత సదానంద శారద అధ్యక్షతన కథా, నవలా రచయితల గోష్ఠి నిర్వహించారు. వేదికపై సుప్రసిద్ధ కథకుడు కాళీపట్నం రామారావును మంత్రి జూపల్లి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి శాలువా కప్పి, జ్ఞాపిక, పదివేల నగదు అందజేసి సత్కరించారు. తెలంగాణలో గ్రామగ్రామాన గ్రం థాలయాలు ఏర్పాటుచేస్తామని, ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తున్నదని మంత్రి తెలిపారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/government-is-a-major-source-of-literary-nutrition-1-2-562371.html