మనభాషకు బ్రహ్మోత్సవం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మనభాషకు బ్రహ్మోత్సవం

venkayyanaidu
మన పలుకుకు పట్టాభిషేకం!
ఇది తేనె తెలుగు పదానికి పట్టాభిషేకం! ఇది కమనీయ తెలుగు వాక్యానికి సింగారించిన అలంకారం! ఇది తెలంగాణ తెలుగు భాషకు అంగరంగ వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవం!! మన బొట్టును.. మన బోనాన్ని.. మన సంస్కృతిని.. మన భాషను కాపాడుకునేందుకు నడుంకట్టిన పాలనలో.. మన అజంత భాష అక్షర సింహాసనాన్ని అధిష్ఠించింది! పాల్కురికి ప్రాంగణంలో.. పోతనామాత్యుని వేదికపై తెలుగు నుడికారం తేనెలొలికింది! తెలంగాణ మాగాణంలో వికసించిన ఎందరో సాహితీకుసుమాల నామస్మరణలతో తెలుగు సంబురం ప్రణవనాదం పలికింది! మమ్మీలనే బడిపలుకుల పరభాషకన్నా.. అమ్మా.. అనే పలుకుబడుల భాషకు గుత్తాధిపత్యాన్ని కట్టబెడుతున్నట్టు ఘనమైన ప్రకటన చేసింది! హేమంతం ముప్పిరిగొంటున్న రాత్రి.. పటాకుల వెలుగు ముగ్గులు గగనతలాన్ని వర్ణశోభితం చేస్తూ.. ముగ్ధ మనోహర దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించిన వేళ.. ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశిష్ట అతిథులు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సహా అశేషంగా హాజరైన ప్రతినిధులు, పండితులు, మహనీయులు, విద్వాంసులు, అతిథుల సమక్షంలో.. తెలుగు భాషను మాతృసమానంగా భావించే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.. ఐదురోజులపాటు సాగే విశ్వ తెలుగు సంరంభం ప్రారంభమైందని లాంఛనంగా ప్రకటించారు. అంతకుముందు అధ్యక్షోపన్యాసం చేసిన సీఎం కే చంద్రశేఖర్‌రావు అమ్మ ఒడే తొలి బడి అన్నారు. జో అచ్యుతానంద.. అంటూ జోలపాటతోనే తన బిడ్డకు తల్లి సాహిత్యాన్ని అలవాటు చేస్తుందని చెప్పారు. సభాప్రారంభానికి ముందే తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మను సత్కరించి.. పాదాభివందనం చేసిన సీఎం.. గురువు గొప్పదనాన్ని, తనలోని నిగర్విని మరోసారి ప్రపంచానికి చూపారు. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమంటూ పాల్కురికి మొదలు.. నేటి తరంలోని గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్ వంటి ఈ గడ్డపై పుట్టిన సాహితీదిగ్గజాలను మననం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు అందరం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో తెలుగు భాష వికాసంకోసం శతధా, సహస్రధా కృషిచేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే ఒకటో తరగతి నుంచి పన్నెండోతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా అమలుచేసేందుకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తెలుగు భాషను ఉద్ధరించాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత తెలుగు పండితులపైననే ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగు భాషావికాసం కోసం, తెలుగు విలసిల్లడంకోసం తెలుగును విశ్వవ్యాప్తం చేయడంకోసం ప్రపంచ తెలుగు మహాసభల మహోత్సవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వివరించారు. పాల్కురికి సోమనాథుడు ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)లో బమ్మెర పోతన వేదిపై నుంచి మహా సంకల్పానికి దీక్ష తీసుకున్నామని వెల్లడించారు. తెలుగుభాషను విశ్వవ్యాప్తంచేయడమే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన ఉద్దేశమని ఆయన ప్రకటించారు. భాషకు ఎల్లలుండవని చెప్పారు. ప్రపంచ దేశాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరూ తెలుగు భాషావ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ రాష్ట్రంలోని తెలుగు భాషా పండితులకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారని, ఆ సమస్యలన్నింటినీ వారం పదిరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తెలుగుపై మక్కువ ఇలా పెరిగింది..
చిన్ననాటి నుంచి తనకు తెలుగుపై ఆసక్తిపెరిగేందుకు దోహదం చేసిన అంశాలను సీఎం మననం చేసుకున్నారు. తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మవంటివారు తనకు తెలుగు భాషపైన మక్కువ పెంచడం వల్లనే తెలుగు భాషలో సాధన చేశానని, కొద్దోగొప్పో మాట్లాడగలుగుతున్నానని అన్నారు. చిన్నతనంలో రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడి వీధి బడిలోనే చదువుకున్నానని, ఆయనే తనలోని తెలుగు ప్రేమను గ్రహించి, మృత్యుంజయశర్మకు అప్పగించారని చెప్పారు. రాయి వంటి తనకు మృత్యుంజయశర్మ సానబట్టారని చెప్తూ.. రత్నమయ్యానో లేదో తనకు తెలియదని సీఎం చమత్కరించారు. నిజంగానే ఉత్తర గోగ్రహణంలోని పద్యం తనను ప్రభావితం చేసిందని గుర్తుచేసుకున్నారు. ఉత్తర గోగ్రహణం పద్యాన్ని అప్పజెప్పిన వారికి బహుమతి ఇస్తానని మృత్యుంజయ శర్మ చెప్పడంతో అప్పటికప్పుడే ఐదుసార్లు మననం చేసుకుని.. భీష్మ ద్రోణ కృపాది ధన్వికరాబీలంబు.. పద్యాన్ని కంఠతా అప్పజెప్పానని సీఎం జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే మృత్యుంజయశర్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమక్షంలో తనకు నోట్‌బుక్ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. తనకు లభించిన ఈ సాహిత్యాభినివేశం గురువులు పెట్టిన జ్ఞానభిక్షని చెప్పారు. గొప్ప గురువులు శిష్యులను ఉద్ధరించడం వల్లే ఈనాటికీ తెలుగు భాష గొప్పతనం, విశిష్టతలు నిలిచి ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

అమ్మ ఒడి తొలి బడి..
అమ్మ ఒడి తొలి బడి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏ బిడ్డ అయినా అమ్మ ఒడిలోనే మొదటి పాఠాలు నేర్చుకుంటుందన్నారు. జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందావంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుందంటూ భావాన్ని వివరించారు. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలని పేర్కొన్నారు. ఆ విధంగా చిన్ననాటి నుంచి అమ్మానాన్నలు, గురువుల చెరగని ముద్రలు తనపై ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ సాహితీ మాగాణం
తెలంగాణ గొప్ప సాహిత్య మాగాణమని కేసీఆర్ ఉద్ఘాటించారు. ధిక్కార స్వరం ఈ నేలమీదనే ఉందని చెప్పారు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్‌కూళలకిచ్చి అప్పడుపుకూడు భుజించుట కంటె సత్కవుల్ హాలికులైననేమి.. అంటూ పోతన పద్యాన్ని ఉదహరించారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము అంటూ సుమతీ శతక పద్యాలను గుర్తుచేశారు. చిన్నతనంలోనే భక్తిభావం పెంపొందేలా తాను గురువుల వద్ద శ్రీరాముని దయ చేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా అనే పద్యాన్ని నేర్చుకున్నానన్నారు. చిన్న పిల్లలందరికీ ఈ పద్యంతోనే తెలుగు భాష నేర్పుతారని, ఆ తర్వాతనే సమీపంలోని గుడికి వెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తారని, ఇది తెలంగాణలో ఉన్న సంప్రదాయమని అన్నారు.

ఇటువంటి గొప్ప సంప్రదాయాలు కనుమరుగై పోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన్న, భక్తరామదాసు, సుకవితా పయోనిధి దాశరథి, ప్రజాకవి కాళోజీ, వానమామలై వరదాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సీ నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహామహులు తెలంగాణ మాగాణాన్ని సాహిత్య మాగాణంగా తీర్చిదిద్దారని అభివర్ణించారు. వర్తమానతరంలో కోవెల సుప్రసన్నాచార్య, తిరుమల శ్రీనివాసాచార్య, ఆచార్య రవ్వా శ్రీహరి వంటి గొప్ప పండితులు, గొప్ప పాటలు రాస్తున్న గోరటి వెంకన్న, అందెశ్రీ, అశోక్‌తేజ, జయరాజు, నవనవలా వికాసానికి నిదర్శనంగా నిలిచిన అంపశయ్య నవీన్, సాహితీవేత్తలు ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌కుమార్‌వంటి వారిని ఈ వేదికపైన ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎంతోమంది ప్రముఖులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, వారి భాషా సాహిత్య సేవలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఉన్నాయన్న సీఎం.. సందర్భవశాత్తు ఎవరిపేరైనా మర్చిపోయినట్లయితే మనస్ఫూర్తిగా మన్నించాలని విజ్ఞప్తిచేశారు.

మరో సందర్భంలో పోతనను గుర్తుచేస్తూ నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళిపరి సర్పిత పింఛమువాడు.. నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో మల్లియలార: మీ పొదలమాటున లేడు గదమ్మ: చెప్పరే పద్యాన్ని ముఖ్యమంత్రి వినిపించారు. పలికెడిది భాగవతమట.. పలికించువాడు రామభద్రుండట.. నే పలికిన భవహరముగనట.. పలికెద వేరొండుగాథ పలుకగనేలా అంటూ పోతన పద్యాల మకరందాలను వివరించారు. సిరిసిల్ల ముద్దుబిడ్డ ఆచార్య సీ నారాయణరెడ్డి పోతన పద్యాలకు మందార మకరందాలు అనే వ్యాఖ్యానం రాశారని, ఆ వ్యాఖ్యానం పోతన పద్యాలు ఎంత కమ్మగా ఉంటాయో? అంత కమ్మగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యానంపైన తాను వ్యాసం రాశానని, కాలేజీస్థాయిలో ఆ వ్యాసానికి అప్పట్లో నా సహాధ్యాయి సిధారెడ్డి పోటీలో లేనందున తనకు మొదటి బహుమతి లభించిందని చెప్పారు. సాధనచేస్తే ఎంతటి గొప్ప విద్యలనైనా నేర్చుకోవచ్చునని, పట్టుసాధించవచ్చునని చెప్పడానికి.. అనగననగరాగ మతిశయించునుండు తినగతినగవేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన పద్యాన్ని ఉదాహరించారు.

గురువుకు పాదాభివందనం
మహాసభల ప్రారంభంలో సీఎం తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మను సత్కరించారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం తిలకం దిద్ది, గంధం పూసి, అత్తరు చల్లి, శాలువాకప్పి పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి సత్ప్రవర్తనకు, నడవడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురిసిపోయారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ విలువలకు నిదర్శనంగా ఉన్నందునే ప్రపంచ తెలుగు మహాసభలు అనే గొప్ప ఉత్సవాన్ని నిర్వహించగలుగుతున్నారని చెప్పారు.

లక్ష్మీదేవి కటాక్షాన్ని గురించి వివరిస్తూ సిరితావచ్చిన వచ్చును, సలలితముగ నారికేళ సలిలముభంగిన్, సిరితాపోయిన పోవును, కరిమింగిన వెలగపండు రీతిని సుమతి పద్యాన్ని జ్ఞాపకం చేశారు. బంధువుల లక్షణాలను వివరిస్తూ అక్కరకు రాని చుట్టము పద్యాన్ని ప్రస్తావించారు. ధీరులు మాత్రమే దృఢసంకల్పాన్ని వదులకుండా, కార్యదక్షతతో ఎన్ని విఘ్నాలు వచ్చినా సాధించదలచుకున్న లక్ష్యాలను సాధించుకుంటారంటూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో అనేకసార్లు ఉదహరించిన ఏనుగు లక్ష్మణకవి నీతి పద్యం.. ఆరంభింపరు నీచ మానవులు..ను మననంచేసుకున్నారు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ అందెశ్రీ పాట స్ఫూర్తిని, గోరటి వెంకన్న పాట విశిష్టతలను వివరిస్తూ గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది పాట పల్లవిని వినిపించారు. మంచిగున్నదా పాట అంటూ చమత్కరించారు. ఆయన పాట పల్లవిని అందుకోగానే సభ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. గల్లి చిన్నది పాట వింటుంటే కళ్లుచెమరుస్తాయని, గరీబోళ్ల జీవన విధానం స్వయంగా చూసినట్లుగా పాట ఉంటుందని చెప్పిన సీఎం.. ఇది గోరటివెంకన్న పాటల గొప్పదనమని అన్నారు. గోరటి కవి, గాయకుడని అభివర్ణించారు. జయరాజు వానమ్మ వానమ్మ వానమ్మా.. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా పాట వింటున్నప్పుడు కరువు కాటకాల తెలంగాణ గుర్తుకొచ్చేలా ఉంటుందన్నారు.

పూతరేకుల లేత వయసు
తాను కాలేజీలో చదివే రోజుల్లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన సినిమాలోని ఒక పాటలో పూతరేకుల లేత వయసు అనే పల్లవిని సీఎం ప్రస్తావించారు. పూతరేకులు అంటే ఏమిటో అర్థంకాక.. నా గురువు ముదిగొండ వీరభద్రయ్యను అడిగాను. ఆయన తనకు కూడా తెలియదని, అడిగి తెలుసుకుంటానని చెప్పారు. అయితే పూతరేకులు కాకుండా పూల రేకులు అయి ఉండొచ్చని అన్నారు. అయితే ఆ సినిమా పాటల పుస్తకం కొని చదివితే, అందులో కూడా పూతరేకులనే ఉంది. దీంతో మళ్లీ మా గురువుగారిని అడిగితే, అప్పుడాయన విజయవాడలోని తన మిత్రుడికి లేఖ రాశారు. అందుకు సదరు విజయవాడ మిత్రుడు.. పూతరేకులంటే ఓ తియ్యని తినుబండారమని బదులిచ్చారు. దాంతో.. నీ సందేహంతో నాలో ఉన్న సందేహం కూడా నివృత్తి అయింది అంటూ నన్ను అభినందించారు అని సీఎం గుర్తుచేసుకున్నారు. 1972 నాటికి పూతరేకులు ఇంకా తెలంగాణకు రాలేదని, ఇప్పుడన్నీ మిఠాయి దుకాణాలల్లో పూతరేకులు అనే స్వీట్ లభిస్తున్నదని సీఎం చెప్పారు.
భవిష్యత్తును గురువులే తీర్చిదిద్దుతారు
భవిష్యత్తును గురువులు తీర్చిదిద్దుతారని సీఎం స్పష్టంచేశారు. ఇందుకు తనకు తన జీవితంలోనే చాలా ఉదాహరణలున్నాయని చెప్పారు. తెలుగు భాష విశ్వవ్యాప్తం చేయాలంటే తెలుగు భాషావైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలంటే గురువులపైననే బాధ్యతలుంటాయని అన్నారు. భాషకు అవధులు, ఎల్లలు ఉండవని అన్నారు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడని, ఒక పండితుడు మరొక పండితుడిని తయారు చేస్తాడని, ఈ గురుపరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

సిద్దిపేట సాహితీ ముద్దుబిడ్డలు
మల్లినాథ సూరి వంటి గొప్ప వ్యాఖ్యాత పాత మెదక్ జిల్లాకు చెందిన వాడేనని ముఖ్యమంత్రి చెప్పారు. కాళిదాసును ప్రపంచానికి మల్లినాథ సూరి పరిచయం చేశాడని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో లభించిన కురిక్యాల శాసనం తెలుగు భాష ప్రాచీన హోదాకు సాక్ష్యంగా నిలిచిందని పేర్కొన్నారు. వేముగంటి నరసింహాచార్య, ముదిగొండ వీరభద్రయ్య, శతావధానులు, అష్టావధానులు సిద్దిపేట సాహిత్య సుక్షేత్రంలో రతనాలు పండించారని కీర్తించారు. ఆ వరుసలోనే నందిని సిధారెడ్డి తన సాహిత్య యాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ సాహిత్య వికాసం, ఈ చైతన్యం, ఈ విశిష్టత, ఈ శ్రమ, ఈ భాషావ్యాప్తి ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/glittering-start-to-world-telugu-conference-1-2-562249.html