పండుగలా మహాసభలు - World telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

పండుగలా మహాసభలు

కొత్త రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలను పండుగలా నిర్వహిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. 40 Telangana Sahithya Akademi Chairman Siddareddy Nandiniదేశాల నుంచి మొత్తం 1000 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు, ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మహాసభల్లో పాల్గొనేందుకు విచ్చేసేవారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించామన్నారు.
ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణతో కలిసి సిధారెడ్డి విలేకరులతో మాట్లాడారు. హూస్టన్‌లోని విస్కోన్‌సిన్‌ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన ఆచార్య డాక్టర్‌ అఫ్సర్‌, న్యూజెర్సీకి చెందిన నారాయణస్వామి వెంకటయోగి, వర్జీనియాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న తెలుగు రచయిత రవి వీరెల్లి, ఇంగ్లండ్‌లో నివసిస్తున్న తెలుగు కథా రచయిత కన్నెగంటి చంద్ర, వంగూరి సంస్థ చైర్మన్‌ వంగూరి చిట్టెంరాజు, వింజమూరి రాధాసుధ, గాయని స్వాతిరెడ్డి, సృజన్‌రెడ్డి, వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఆసియా దేశాల సాహిత్య సాంస్కృతిక విభాగం ప్రొఫెసర్‌ ప్రభావతి తదితర 36 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని తెలిపారు. 160 మంది భాషాభిమానులు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. మరో 200 నుంచి 300 మంది ప్రతినిధులు సొంత ఖర్చులతో సభలకు విచ్చేస్తున్నారని తెలిపారు. వెయ్యేళ్ల కిత్రం బర్మాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన మోన్‌ ప్రతినిధులకు సైతం ఆహ్వానాలు పంపంపించామని వివరించారు. మలేసియాలో తెలుగు కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు మహాసభల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారని అన్నారు. మన దేశం నుంచి మరాఠా రచయిత వసంత్‌ అభాజిత్‌ దహేకే(మహారాష్ట్ర), బెంగాలీ రచయిత సుబోధ్‌ సర్కార్‌(కోల్‌కతా), తమిళ స్త్రీవాద రచయిత సల్మా(చెన్నై), హిందీ రచయిత డాక్టర్‌ అనామిక (న్యూఢిల్లీ), డాక్టర్‌ వనిత (న్యూఢిల్లీ), ఉత్తరాఖండ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హెచ్‌.ఎస్.శివప్రకాశ్‌ సభలకు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారని సిధారెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సుమారు 3000 మంది కళాకారులతో లలిత కళాతోరణంలో ప్రత్యేక ప్రదర్శనలకు రూపకల్పన చేస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. డోలు నృత్య కళాకారుల ప్రదర్శనలతోపాటు బుర్రకథ, చిందుయక్షగానం, తోలుబొమ్మలాట, కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

19న సభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని సిధారెడ్డి చెప్పారు. ముగింపు వేడుకలకు దాదాపు 50 వేల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. ఐదు రోజుల పాటు సభలకు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

ఆహ్వానితులకు వసతి సౌకర్యాలు సిద్ధం
మహాసభలకు అధికారికంగా ఆహ్వానించిన ప్రముఖులకు నగరంలో ఎంపిక చేసిన హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఎల్‌బీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌, రవీంద్రభారతి ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులు, కళాకారులకు భోజన, వసతికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Source: http://www.andhrajyothy.com/artical?SID=504684