తెలుగు భాషాచరిత్ర తిరుగరాస్తున్నాం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు భాషాచరిత్ర తిరుగరాస్తున్నాం

KadiyamSrihari
తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది తెలంగాణలోనేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తెలుగుకు సంబంధించిన కవులు, సాహితీమూర్తులు జన్మించినగడ్డ తెలంగాణ అని అన్నారు. కొన్ని కారణాలు, ఉద్దేశాలతో గత పాలకులు తెలంగాణ తెలుగు చరిత్రను తొక్కి పెట్టారని విమర్శించారు. తెలంగాణలో తెలుగు భాషా చరిత్రను తిరుగరాసే లక్ష్యంతో, మరుగునపడిన తెలుగు భాష, సాహితీమూర్తులు, చరిత్ర, తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలకు ఆలోచన చేశారని తెలిపారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ మహాసభలను అత్యంత వైభవంగా, దేశ విదేశాల ప్రతినిధులతో నిర్వహించనున్నామని చెప్పారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే మహాసభల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం ఆధ్వర్యంలో ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. మహాసభల ఏర్పాట్లలో తలమునకలై ఉన్న కడియం.. నమస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇవీ వివరాలు.. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ లక్ష్యాలు,ప్రాధాన్యాలేంటి?
రాష్ట్రంలో తెలుగు భాష చరిత్ర, తెలంగాణ సంస్కృతి, జానపదాలు, జీవన విధానం ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆలోచనతోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నాం. తెలుగు అత్యంత ప్రాచుర్యం పొందిన నేల తెలంగాణ. ఇక్కడ ఎంతోమంది సాహితీమూర్తులు జన్మించారు. వారందరినీ స్మరించుకునేలా ప్రపంచ తెలుగు మహాసభలను అంత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆలోచన. ఆయన ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం.

LB-STDIAM

దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు?
ఎనిమిది వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందులో ఇతర దేశాలు, రాష్ర్టాలకు చెందిన తెలుగు కవులు, కళాకారులు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. సభలకు హాజరవుతున్న దేశ, విదేశ ప్రతినిధులకు రవాణా ఖర్చులతోపాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించాం. ప్రతినిధులందరికీ వేదికల వద్ద భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాం.

మహాసభల నిర్వహణకోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు?
తెలంగాణ రాష్ట్రంలోనే తెలుగు భాష అంత్యంత ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషకోసం తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది సాహితీమూర్తులు కృషిచేశారు. ఆంధ్ర కంటే తెలంగాణలోనే తెలుగు భాష ప్రాధాన్యాన్ని అనేకమంది కవులు చాటిచెప్పారు. స్వరాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన వారిని స్మరించుకోవడానికి, వారి ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పడానికి హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద సంఖ్యలో స్వాగత తోరణాలను ఏర్పాటుచేశాం. ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడి పేరుతో ప్రధాన వేదిక ఏర్పాటుచేశాం. స్వాగత తోరణాలకు సాహితీమూర్తుల ఫోటోలతో సహా వారి పేర్లు పెట్టాం. భాషా పండితులు, (తెలుగు ఉపాధ్యాయులు), కాలేజీ, యూనివర్సిటీ అధ్యాపకులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించాం. ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, తెలుగు భాషపై ప్రేమ ఉన్నవారందరూ, ఆహ్వానితులు కాకపోయినా అందరూ ఈ సభలకు హాజరుకావచ్చు. ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. తెలుగు మహాసభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
KadiyamSrihari1
తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి?

గత పాలకులవల్ల తెలుగు తెలంగాణకు కాకుండాపోయింది. ఇందులో అనేక కారణాలు, ఎన్నో ఉద్దేశాలు దాగి ఉన్నాయి. మరుగున పడిన ఇలాంటి వాస్తవాలు, తెలుగు భాష చరిత్రను, సాహితీమూర్తుల గొప్పదనాన్ని ప్రపంచానికి వినిపించడంకోసం ఈ ప్రపంచ మహాసభల పేరుతో తెలుగు భాషా సంబురాలు జరుపుకొంటున్నాం. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించే అంశంపై కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. తెలుగు ప్రాచీన హోదా కేంద్రం ఏర్పాటుపై మహాసభల్లో స్పష్టత వస్తుంది. తెలుగు భాషాభివృద్ధికి, రచనలకు సంబంధించి కార్యాచరణ కూడా ఈ సభలలో ప్రస్తావనకు వస్తుంది.

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి?
రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో సాహిత్య అకాడమీని ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల బోర్డులు తెలుగులో ఉండేలా నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిచేస్తున్నాం. ఉర్దూ, ఆంగ్ల భాషల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తెలుగు మహాసభల అనంతరం తెలుగు భాషపై అనేక పరిశోధనలు నిర్వహించనున్నాం. రచనలను భద్రపరిచేందుకు చర్యలు కొనసాగిస్తాం.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/dy-cm-kadiyam-srihari-inspects-arrangements-for-world-telugu-conference-at-lb-stadium-1-2-562067.html