దశదిశలా తెలుగు వెలుగులు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

దశదిశలా తెలుగు వెలుగులు

KadiyamSrihari
తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా చాటుదాం అనే ప్రధాన నినాదంతో ఈ నెల 15నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రారంభోత్సవం రోజున ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికే నిర్వహణ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధాన వేదిక లాల్‌బహద్దూర్ స్టేడియం సర్వాంగసుందరంగా ముస్తాబయ్యిందని పేర్కొన్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికలను సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో జరుగుతున్న ఈ మహాసభలకోసం ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భాషాభిమానులు వస్తున్నారని చెప్పారు.

ప్రతీ తెలుగు భాషాభిమానికి సమాచారం చేరుకునేలా కరదీపికలను అందుబాటులోకి తెచ్చామని, మీడియా ఈ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. పని విభజనకోసం అనేక కమిటీలను ఏర్పాటుచేసుకున్నామని, అన్ని కమిటీలు అద్భుతంగా పనిచేసి మహాసభల కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేశాయని కడియం చెప్పారు. తెలుగుభాష పండుగను జయప్రదం చేసేందుకు అందరూ ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ ప్రారంభోత్సవం నుంచి ముగింపు వరకు ఐదురోజుల పాటు తెలుగుభాష సాంస్కృతిక చైతన్యం ఉట్టిపడేవిధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మహాసభల సందర్భంగా పద్యకవిత్వం, వచనకవిత్వం, కథ, నవల, విమర్శ వంటి వివిధ సాహిత్య ప్రక్రియలపైన సదస్సులు ఉంటాయని చెప్పారు. దాదాపు 100 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ గుండెనిండుగా జరుగుతున్న తెలుగు పండుగకు అందరూ రావాలని కోరారు.
WTC - Programmes Handbook
ఈ నెల 15న సాయంత్రం గంటలకు ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. లాల్‌బహదుర్ స్టేడియంలోని ఈ ప్రాంతానికి పాల్కురికి సోమన ప్రాంగణం అని నామకరణం చేశారు. వేదికకు బమ్మెర పోతన పేరుపెట్టారు. సమాపనోత్సవం ఈ నెల 19న ఇదే వేదికపైన జరుగనున్నది. సాయంత్రం 5గంటలకు కన్నుల పండువగా జరిగే లేజర్‌షో రంగురంగుల కాంతుల మధ్యన ముగింపు ఉత్సవాలు ఉంటాయి. ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షత వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశిష్టఅతిథిగా పాల్గొంటారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/deputy-cm-kadiyam-srihari-unveils-world-telugu-conference-brochure-1-2-561994.html