తెలంగాణ భాషను నిర్వచించుకోవాలి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ భాషను నిర్వచించుకోవాలి

80 ఏండ్ల వయస్సు. అయినా మొహంలో చెరగని చిరునవ్వు. ప్రపంచ తెలుగుమహాసభల కోసం ఆయన ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ భాష, యాసలకు మంచి రోజులు వస్తున్నాయని సంతోషపడుతున్నారు. ఇన్నాళ్లు తెర వెనుకగల తెలంగాణ కవులు ఇక తెర ముందుకొస్తారని, వారి రచనలు యువ కవుల్లో ఉత్సాహాన్ని నింపుతాయని సంబురపడుతున్నారు. ఆయనే ప్రముఖ సాహితీవేత్త, సీఎం కేసీఆర్‌కు పాఠాలు నేర్పిన తిరుమల శ్రీనివాసాచార్య. తెలుగు మహాసభల సందర్భంగా నమస్తే తెలంగాణ ఆయన్ను పలకరించింది. ఆయన పంచుకున్న మధుర స్మృతులు..
srinivasacharya
ఆయన మాటల్లోనే..
ప్రపంచ తెలుగు మహాసభలు కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారి జరుగుతుండటం ఇక్కడి ప్రజల అదృష్టం. ప్రతి జిల్లాలో ఎందరో కవులు, రచయితలు ఉన్నా, వారు వెలుగులోకి రాలేదు. దీన్ని నిరూపించడానికి నాడు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక విడుదల చేశాక.. తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీసే బృహత్కార్యం జరగలేదు. దాశరథి, కాళోజీ, వానమామలై నుంచి ఇప్పటి దాకా పలువురు గొప్ప రచయితల పేర్లు అంతగా వెలుగు చూడలేదు. తెలంగాణవాదం ముందుకొచ్చాకే వీరు సమాజానికి తెలిశారు. గోల్కొండ, ఆంధ్రభూమి తర్వాత.. నమస్తే తెలంగాణ మాత్రమే తెలంగాణ సాహితీవేత్తలను పోత్సహిస్తున్నది. మరికొన్ని పత్రికలూ సాహిత్యం కోసం వారంలో ఒక పేజీ ఇస్తున్నాయి. విస్తృతంగా సాహిత్యం గురించి, మన కవుల గురించి రాసే రోజు రావాలి. సాహిత్యంపై మక్కువ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. యువకవుల పుస్తకాల ప్రచురణలకు సర్కార్ సాయమందించాలి. తెలుగు మహాసభలు తెలంగాణ భాష, యాస వికాసానికి ఉత్ప్రేరకంగా పనిచేయాలి.
తెలుగు భాష వికాసానికి గొప్ప అవకాశం
ప్రపంచ మహాసభలవల్ల తెలంగాణ భాష ఎలా ఉండాలన్న సోయి వచ్చింది. రాష్ట్రంలో వందల మంది కవులున్నా, వారి రచనలకు గుర్తింపులేదు. ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వారందరినీ సన్మానించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఒక్కో జిల్లాలోని ఒక్కో సాహితీచరిత్రను క్రోడీకరించుకుని ప్రామాణిక నిఘంటువు రూపొందించుకోవాలి.
మన భాషపై ఏనాడు దృష్టి సారించలేదు...
1956 నుంచి సీఎంలను చూస్తున్నాను. ఎవ్వరికీ కేసీఆర్‌కు ఉన్నంత శ్రద్ధ లేదు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో తెలంగాణ మంత్రులున్నా.. ఒక్క నాయకుడూ తెలంగాణ కవుల గురించి మాట్లాడలేదు. ఏపీ నేతలే తెలంగాణ కవులకు ఒకటో రెండో పురస్కారాలిప్పించేవారు.
సాహిత్యానికి సీఎం కేసీఆర్ పాదాభివందనం
1964లో దుబ్బాక హైస్కూలో టీచర్‌గా చేశాను. విద్యార్థిగా కేసీఆర్ క్రమశిక్షణ, వినయంతో చురుగ్గా ఉండేవారు. ఒకరోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పుస్తకావిష్కరణ సభకు అనుకోకుండా వచ్చారు. వేదిక మీద మీరు నా గురువు అని నమస్కారం చేశారు. 2015లో నన్ను దాశరథీ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసి.. రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఆ సమయంలో కేసీఆర్ నాకు పాదాభివందనం చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక సీఎం సాహిత్యాన్ని ఇంతగా గౌరవించడం ఆద్భుతం. దాన్ని సాహిత్యానికి చేసిన పాదాభివందనంగా భావించాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కలను నిజం చేసేందుకు కేసీఆర్ జన్మించారా.. అనిపిస్తున్నది. తెలంగాణను దాశరథి ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు. ఇప్పుడు కేసీఆర్ అంతే స్థాయిలో ప్రేమిస్తున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/define-the-language-of-telangana-1-2-561964.html