కొత్త పుంతలు తొక్కిన తెలుగు కవిత - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కొత్త పుంతలు తొక్కిన తెలుగు కవిత

sheri-subash-reddy

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు కవిత కొత్తపుంతలు తొక్కుతున్నది. ప్రక్రియాభేదం లేకుండా అన్ని ప్రక్రియల్లో అనేక సమకాలీన, సార్వకాలికమైన అంశాలపై మూడు రోజులుగా సాగుతున్న బృహత్ కవిసమ్మేళనంలో కవితలు రసజ్ఞుల హృదయాలను హత్తుకున్నాయి. సోమవారం నాలుగోరోజు అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం( ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం) లో జరిగిన బృహత్‌కవిసమ్మేళనానికి పెద్దఎత్తున సాహితీప్రియులు, కవులు, రచయితలు హాజరయ్యారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన తొలి దశ కవిసమ్మేళనానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు సీఎం కేసీఆర్ చేస్తున్న సేవ మరువలేనిదని చెప్పారు. భాషను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, నిర్ణయాల్లో భాషాపండితులు, సాహితీవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు భాష ప్రత్యేకతను, ప్రాభవాన్ని కాపాడటానికి చేస్తున్న కృషికి అందరు సహకరించాలన్నారు. మధ్యాహ్నపు కవిసమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు గొప్ప ఉత్సవంగా జరుగుతున్నాయని, ఎంతోమంది పండితులు, కవులు, కళాకారులు మనకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు మహాసభల ద్వారా సాహిత్య, సాంస్కృతిక గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

దేశంలో ఎక్కడా ఇంత గొప్పగా భాషా సాహిత్య సభలు జరుగలేదని, తెలంగాణ సాహిత్యవేత్తల కలలన్నీ సాకారమవుతాయని సుభాష్‌రెడ్డి వెల్లడించారు. వీరితోపాటుగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ దశల్లో నిర్వహించిన బృహత్ కవి సమ్మేళన కార్యక్రమాల్లో ముఖ్యఅతిథులుగా వరుసగా ఫుడ్‌కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీ వెంకటేశ్వర్లు, బేవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు దేవీప్రసాద్, శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్, సోలిపేట రామలింగారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు సభల ప్రాధాన్యం గురించి అతిథులు వివరించారు. తెలంగాణ వస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించిన వాళ్లకు ప్రపంచ తెలుగు మహాసభలు కనువిప్పు కలిగిస్తాయన్నారు. సభల అధ్యక్షులుగా కోయి కోటేశ్వర్‌రావు, అన్నవరం దేవేందర్, గుడిపల్లి నిరంజన్, రూప్‌కుమార్ డబ్బీకార్, చమన్ సింగ్, వేణుశ్రీ, కలువకుంట రామకృష్ణ, వఝల శివకుమార్, నాళేశ్వరం శంకరం వ్యవహరించారు. సమావేశ కర్తలుగా దాసోజు కృష్ణమాచారి, పొన్నం రాజయ్యగౌడ్, మౌనశ్రీ మల్లిక్, కాంచనపల్లి రాజేందర్‌రాజు, జీ మద్దిలేటి, తిరునగరి శ్రీనివాస్, టీవీ భాస్కరాచార్య, కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, కందుకూరి నాగేందర్ ఉన్నారు. బృహత్ కవి సమ్మేళనంలో భాగంగా ముఖ్యఅతిథులకు, ప్రముఖ రచయితలకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ పాల్గొన్నారు.

devi-prasad

తేట భాషల ఊట నా తెలుగు
ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో కవితల హోరు
నాలుగురోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న బృహత్‌కవి సమ్మేళనంలో కవితాఝరి ఉప్పొంగుతున్నది. మచ్చుకు కొన్ని కవితలు..
తెలుగంటేనే నా తెలంగాణ.. తేట భాషల ఊట నా తెలుగు.. వెలుగు బాటలు పరుచు నా తేట తెలుగు.. తేనే మధురిమలు చిలుకు నా తెలుగు భాష.. అంటూ ఓ కవి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాషను పంచుదాం.. తెలుగు వెలుగు నింపుదాం. మాట మాటకు తెలుగు మాటల తేనెలొలుకుదాం… అమ్మ భాషను నిలుపుదాం.. మాతృ భాషను కదుపుదాం.. మాటి మాటికి తేనె తుట్టెల తెలుగు పట్టును కదుపుదాం.. అని మరో కవి కవిత వినిపించారు.

బహుజన కవిత్వం వర్ధిల్లుతున్నది
బహుజన కవిత్వం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అనేక ప్రక్రియలలో వెలువడుతుండటం శుభపరిణామం. తెలంగాణ ఉద్యమం తెలుగు సాహిత్యంలో బహుముఖీనమైన పాత్ర వహించింది. తెలుగు భాష, యాస, మాండలికాలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. ఇక్కడి వ్యవహారిక భాషను అవమానించిన వారు నేడు అనివార్యంగా గౌరవించాల్సివస్తున్నది. తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం తెలుగు సాహిత్యమూర్తులను గౌరవించడం ఒక చారిత్రక సన్నివేశం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాహిత్యాభిమానిగా ఈ సభలను నిర్వహించడం మనందరికీ గర్వకారణం.
– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు,
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు

సెక్యూరిటీ గార్డు కవితాగానం
అంబర్‌పేట: చేసేది చిరుద్యోగం. అయినా కవితాశక్త్తికేమీ లోటులేదు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామానికి చెందిన బియ్యన తిరుపతి స్థానికంగా ఓ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా జీవనోపాధి పొందుతూ తన రచనలతో పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పల్లేరు గాయాల పాడు భూములకు ప్రాణం పోసిండూ.. చెరువు కుంటలను చెరనుంచి విముక్తి చేసిండూ.. మన సీఎం కేసీఆర్ చేపట్టిన చెరువుల జాతరలో అందరూ కదులండి.. తట్టాపారలు పట్టండి.. హారతులివ్వండి.. అన్నకు దీవనలివ్వండీ అంటూ దేశంలో పలురాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ పథకంపై తెలుగు మహాసభల కవి సమ్మేళనంలో తన గళాన్ని వినిపించారు.

vinay-bhaskar

మహ్మద్ వలీ.. తెలుగుకవితా ఝరి
అంబర్‌పేట: వరంగల్ జిల్లాకు చెందిన మహ్మద్‌వలీ హుస్సేన్.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన బృహత్ కవిసమ్మేళనంలో కమ్మనైన తెలుగుభాషలో తనదైన భావా న్ని వచనకవిత రూపంలో వినిపించి అందరి మన్ననలు పొందారు. మనిషి మనిషిలా లేడు.. మనిషి బంధం తెగిపోతున్నది అంటూ దిగజారుతున్న మానవ సంబంధాలపై తెలుగు మహాభల్లో తన కవితను వినిపించిన హుస్సేన్ అందరినీ ఆలోచింపజేశారు. హైదరాబాద్ వ్యవనసాయ విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తూ వందల కవితలు, కథలు, వ్యాపాలు రాసి తెలుగుతల్లికి సాహితీసేవ చేస్తున్నారు హుస్సేన్.

నేటి కార్యక్రమాలు
ఎల్బీ స్టేడియం( పాల్కురికి సోమన ప్రాంగణం.. బమ్మెర పోతన వేదిక)
– సాయంత్రం ఐదు గంటలకు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశిష్ట అతిథిగా పాల్గొంటారు. సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం (బిరుదురాజు రామరాజు ప్రాంగణం, సామల సదాశివ వేదిక)
– ఉదయం 10 గంటల నుంచి తెలంగాణలో తెలుగు భాషా సదస్సు రవీంద్రభారతి(డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం, బండారు అచ్చమాంబ వేదిక)
– ఉదయం 10 గంటలకు విదేశీ తెలుగువారితో గోష్ఠి
– మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రేతర తెలుగువారితో గోష్ఠి
రవీంద్రభారతి సమావేశమందిరం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణం, ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక)
– ఉదయం 10 గంటలకు తెలంగాణ చరిత్రపై సదస్సు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం (అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, వానమామలై వేదిక)
– ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బృహత్‌కవి సమ్మేళనాలు
తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం (మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం, కోరుట్ల కృష్ణమాచార్య వేదిక)
– ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు శతావధానం

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcrs-service-to-the-telugu-language-is-unforgettable-1-2-562448.html