తెలుగు మహాసభల్లో సినీశోభ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మహాసభల్లో సినీశోభ!

హైదరాబాద్ వేదికగా అద్భుతంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు.. సోమవారం యావత్ తెలుగు సినీ ప్రపంచం తరలిరావడంతో మరింత శోభాయమానంగా మారాయి. తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ హాజరై మహాసభల నిర్వహణపై ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు భాష అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన దివంగత నటులు కాంతారావు భార్య హైమవతి, ప్రభాకర్‌రెడ్డి భార్య సంయుక్తను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సముచితంగా సత్కరించారు. మరో దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతిని కూడా గవర్నర్ సత్కరించారు. వేదికపై సినీ ప్రముఖుల ప్రసంగాలు వారి మాటల్లోనే!
chiranjeevi
కేసీఆర్ ద్వారా తెలుగు వెలుగుతుంది: సూపర్‌స్టార్ కృష్
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నా రు. తెలుగువాడిని కావడం వల్లనే 300 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. తెలుగును బతికించేందుకు సీఎం కేసీఆర్ మహాసభలను నిర్వహించడం హర్షణీయం. ఆయన ద్వారా తెలుగు వెలుగుతుంది.

భాషపట్ల కేసీఆర్ అభిమానం అనిర్వచనీయం: నటి జమున
ప్రారంభ సమావేశంలో సీఎం కేసీఆర్ పద్యాలు పాడటం చూస్తే ఆయన భాషాభిమానం తెలుస్తున్నది. దివంగత నటు డు కాంతారావు కుటుంబం తలదాచుకునేందుకు ఒక ఇల్లు సమకూర్చాలని నా మనవి.

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: మెగాస్టార్ చిరంజీవి
ఈ మహాసభల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.. 1వ తరగతి నుంచి 12 వతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలని సీఎం నిర్ణయించడం చూస్తే సంతోషం కలుగుతున్నది. మంత్రి కేటీఆర్ నన్ను తెలుగు మహాసభలకు రమ్మని ఆహ్వానించినప్పుడు..నేను ట్విట్టర్లో ఆంగ్లంలో సమాధానమిస్తే.. అన్నా తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంలో తెలుగులో ట్వీట్ చేయొచ్చుకదాని కేటీఆర్ సూచించారు. అది నా మనసును తాకింది.

b-narsinga-rao
పోరాటయోధుడు కేసీఆర్: సీనియర్ హీరో మోహన్‌బాబు
బంగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాష ఎక్కడ చచ్చిపోతుందో అని తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషిచేస్తున్న తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఆయన గురించి చెప్పాలంటే వేదికకు సమయం సరిపోదు.. పుస్తకమే రాయచ్చు. మంత్రి కేటీఆర్‌కూడా తండ్రికి తగ్గ తనయుడు. ఒక మంత్రి అయి ఉండి కూడా ఒక్కొక్కరినీ దగ్గరకు వచ్చి పలుకరించడం చూస్తుంటే.. కేటీఆర్ సంస్కారానికి హ్యాట్సాఫ్.. లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినందుకు గాను నా సొంత శాలువాతో సన్మానిస్తానంటూ.. మోహన్‌బాబు కేటీఆర్‌ను సన్మానించారు.

ఇక్కడి వారికి ఎదిరించడమూ తెలుసు: నందమూరి బాలకృష్ణ
ప్రాంతాలు వేరైనా.. స్నేహ భావం వీడని తెలుగు ప్రజలకు, వీరతెలంగాణ పుత్రులు, సోదరీమణులకు కళాభివందనాలు.. తెలంగాణ గడ్డమీద పుట్టిన వారికి అభిమానించడమే కాదు.. సమస్య వస్తే ఎదిరించడం కూడా తెలుసు.. మాతృభాషను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం.

mrs-kantha-rao

కేసీఆర్ అరుదైన నాయకుడు: రాజేంద్రప్రసాద్
ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ పుంభావ సరస్వతి.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా గెలిచినపుడు నేను శాలువా తీసుకువెళితే.. మీరు కాదు నన్ను సన్మానించడం నేనే నిన్ను సన్మానిస్తాను అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఔదార్యం మరిచిపోలేను. మనం అనేకమంది నాయకులను చూస్తాం. అమరావతి ప్రారంభానికి వచ్చిన కేసీఆర్‌ను వేదిక మీదకు పిలిచిన వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు చప్పట్లు కొట్టారు. అక్కడ చూశాను తెలుగు ప్రజల్లో ఆయనకున్న ప్రత్యేకత.
సీఎం పద్యాలు ఆనందాన్నిచ్చాయి: కోట శ్రీనివాసరావు
తెలుగు మహాసభలు ప్రారంభం రోజు నేను ఎల్‌బీ మైదానానికి వచ్చాను. సీఎం కేసీఆర్ పద్యాలు పాడటం నాకు సంతోషం కలిగింది. తెలుగు భాషను కాపాడుకునేందుకు ఆయనెంతో శ్రమిస్తున్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు మనమంతా కృషి చేద్దాం. హీరో నాగార్జున మాట్లాడుతూ తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. మనమంతా తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రయత్నిద్దామన్నారు. సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆనందం కలిగించిందన్నారు. హీరో వెంకటేశ్ మాట్లాడుతూ వెలకట్టలేని సంపద అయిన మన తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేద్దామని పిలుపునిచ్చారు. భాషను కాపాడటానికి సీఎం కేసీఆర్ ఆయన బృందం చేస్తున్న మహాయజ్ఞం నెరవేరాలని, ప్రతి సినిమా హోర్డింగ్ మీద తెలుగు భాష గురించి నినాదాలను ముద్రించాలని ప్రభుత్వం నిబంధన తేవాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోరారు. సభలను నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు చెప్పారు.

mrs-prabhakar

తెలుగును ఆదరించాలి: బీ నర్సింగరావు, సినీదర్శకుడు
సినిమా ప్రజలకు బలంగా ఉపయోగపడాలని నమ్మేవాళ్లలో నేను కూడా ఒక్కడిని. తెలంగాణ సాహిత్యం, కళలతో విరాజిల్లిన నేల. సాహితీ సౌరభాలతో తెలుగుభాషను మరుగున పడకుండా ఐదు రోజుల పాటు పండుగను నిర్వహిస్తున్నారు. ప్రజల తెలుగు అదరించాలి.

జై తెలంగాణ: శంకర్, సినీదర్శకుడు
కాళోజీ అక్షరాలు ఆయుధాలై.. గుండెల నిండా జై తెలంగాణ నినాదం కేసీఆర్‌ది అయింది. బంగారు తెలంగాణ అయింది. దాని ప్రతిరూపం అంబరాన్ని అంటే సంబురమైంది.
సినీ ప్రముఖులకు సత్కారం
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ సినీ ప్రముఖులను సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, అల్లుఅరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబు, జమున, జయసుధ, ప్రభ, గిరిబాబు, బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, బాబుమోహన్, రాజమౌళి, రాఘవేందర్‌రావు, ఎన్ శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌రాజు, అశ్వనీదత్, నరేశ్, రాజేంద్రప్రసాద్, ఆర్ నారాయణమూర్తి, పరుచూరి వెంకటేశ్వర్‌రావు, జగపతిబాబు, సుమన్, నందినిరెడ్డి, ప్రేమ్‌రాజు, శ్యాంప్రసాద్‌రెడ్డి, క్రిష్, తరుణ్‌భాస్కర్, బీ నర్సింగరావు, కే రాఘవ, కేఎస్ రామారావు, శివాజీరాజా, బెనర్జీ, పోసాని కృష్ణమురళి, ఆర్పీ పట్నాయక్, ఉత్తేజ్, హేమ, సాయికార్తీక్, కేఎం రాధాకృష్ణన్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహన్‌రావు, ఆదిశేషగిరిరావు, కాకర్లశ్యామ్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఎంపీ బాల్క సుమన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో సినీ సంగీతదర్శకులు, గాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. పలికెడిది భాగవతమట అన్న పోతన పద్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అనేక సినీ గీతాలను, బతుకమ్మ పాటలను గాయకులు ఆలపించారు.

కేసీఆర్ కారణజన్ముడు: బ్రహ్మానందం
తెలుగుచదువుకున్న వాడు ముఖ్యమంత్రి కాగలరని కే చంద్రశేఖర్‌రావు చూపించారు. తెలుగు చదువుకున్న వారు దేశాన్ని శాసించగలరు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కారణజన్ముడు. ఆయన తొమ్మిదిమంది సంతానం తరువాత ఎందుకు పుట్టారంటే తెలంగాణ జాతిపిత కావడానికే. ఆయన తెలంగాణ ప్రజలందరి ముద్దుబిడ్డ. తన గురువుకు మోకాళ్ల మీద వంగి పాదాభివందనం చేయడం ఆయనలో వినయం, సంస్కారాన్ని తెలుపుతున్నది.

కేసీఆర్ ప్రధాని కావాలి: ఆర్ నారాయణమూర్తి
కోట్ల మంది ప్రజలు చూస్తుండగా.. సీఎం కేసీఆర్ తన గురువుకు వేదికపై పాద నమస్కారం చేశారు. అలాంటి కేసీఆర్‌కు నా నమస్కారాలు.. పీవీ నరసింహారావులాంటి రాజకీయ చతురత, సాహిత్య జిజ్ఞాస ఉన్న సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-wants-to-become-prime-minister-says-r-narayana-murthi-1-2-562446.html