తెలంగాణకు పూర్వవైభవం - World Telugu conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణకు పూర్వవైభవం

అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ, పూర్వవైభవం సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలియజెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వివిధదేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడిపెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ఎన్నారైలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో, ఇప్పుడు అదేవిధంగా దూసుకుపోతున్నది. అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతున్నది. 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచింది. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యకమాలు అద్భుతంగా అమలవుతున్నాయి. రూ.40వేల కోట్లతో కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, కేసీఆర్ కిట్స్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సంక్షేమరంగంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం. శాంతిభద్రతల పరిరక్షణ చాలా బాగుంది. కేవలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చే అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక విధానం అమలవుతున్నది. ఈ విషయాలను ప్రపంచవ్యాప్తంగా వివరించి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కృషిచేయండి. తెలంగాణ బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుతున్నా అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమైక్య ఆంధ్రపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అన్నిరంగాల్లో వెనుకబడింది. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ గొప్పతనం మరుగున పడింది. మన భాష, యాస, సంస్కృతి అన్నీ అవమానానికి గురయ్యాయి.
MinisterKavithaఈ పరిస్థితిలో మనం తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వపెద్దల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ప్రశ్నలు వచ్చేవి. ఢిల్లీలో ఎవరితో మాట్లాడినా మనల్ని ఆంధ్రవారిగానే సంబోధించేవారు. ఆంధ్ర మే క్యా హోరా అనే వాళ్లు. మన తెలంగాణ అస్తిత్వాన్నే ఎవరూ గుర్తించలేదు. తెలంగాణకు ప్రత్యేక అస్తిత్వమున్నదనే విషయాన్నే మరుగునపడేసే ప్రయత్నం జరిగింది అని సీఎం నాటి పరిస్థితిని గుర్తుచేశారు. సమైక్యరాష్ట్రంలో ముఖ్యంగా మూడు విషయాల్లో తీవ్ర వివక్ష ప్రదర్శించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికొచ్చే ఆదాయంలో 70 శాతం వరకు తెలంగాణ నుంచే వచ్చేది. కానీ 10-15 శాతం కూడా తెలంగాణ కోసం ఖర్చు చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్థికవేత్త హనుమంతరావు 1956 నుంచి లెక్కలు తీసి ఈ విషయం బయటపెట్టారు. 1,350 టీఎంసీల నీటివాటా తెలంగాణకు ఉన్నప్పటికీ కనీసం 200 టీఎంసీలు కూడా వాడుకోలేదు. ఉద్యోగ నియామకాల్లో కూడా ఎంతో వివక్ష ప్రదర్శించారు. భాష, సంస్కృతిపై దాడి జరిగింది. సినిమాల్లో తెలంగాణవారిని జోకర్లుగా చూపెట్టేవారు. అట్లాంటి స్థితి నుంచే మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొన్నాం. వచ్చిన తెలంగాణలో అన్నిరకాలుగా అభివృద్ధి సాధించుకొంటున్నాం. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చుకొంటున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. చిమ్మ చీకట్లు అలుముకొన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌రంగంలో అద్భుత ప్రగతి సాధించాం. వచ్చే జనవరి 1 నుంచి నాణ్యమైన కరెంటును 24 గంటలపాటు అన్ని రంగాలకు అందించబోతున్నాం.

హైదరాబాద్‌లో క్షణం కూడా కరెంటు పోకుండా ఐలాండ్ పవర్ సప్లయ్ చేస్తున్నాం అంటూ విద్యుత్‌రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 70 శాతం చెరువుల పునరుద్ధరణ జరిగింది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే జనవరి చివరి వరకు అన్ని గ్రామాలకు, ఆవాస ప్రాంతాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు అందుతుంది. పాత ఏడు జిల్లాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పాక్షికంగా నీరు అందుతుంది. రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేయడానికి ఎకరానికి ఏడాదికి రూ.8వేల పెట్టుబడి అందించే కార్యక్రమం వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది. 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నాం. ఇప్పటికే 5వేల పరిశ్రమలకు అనుమతులివ్వగా, వాటిలో రెండువేల పరిశ్రమలు పని ప్రారంభించాయి. ఇలా అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతున్నది. ఈ విషయాలన్నీ ప్రపంచానికి చెప్పి, తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా మీరు కృషిచేయాలి అని సీఎం పిలుపునిచ్చారు. ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎన్నారైల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-reaches-out-to-nris-1-2-562370.html