తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో సి ఎమ్ కేసీఆర్ సమావేశం

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం

CM-KCR-on-arrangements-of-World-Telugu-Conference
తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా అత్యంత జనరంజకంగా భాగ్యనగరం భాసిల్లేలా స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి, శ్రీమతి ఎంపి కె. కవిత, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ శ్రీ నందిని సిధ్దారెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీ అల్లం నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ జనార్థన్ రెడ్డి, అధికార భాషా సఘం అధ్యక్షులు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ ఎస్వీ. సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీ శ్రీ వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ శ్రీ ఏనుగు నర్సింహారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ హరికృష్ణ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఆచార్య ఎన్.గోపి, శ్రీ అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ద్రవిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి, కవి, పండితులు, పరిశోదకులు డా.కోవెల సుప్రసన్నాచార్య, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు వెలిచాల కొండలరావు, కవి, గాయకుడు శ్రీ దేశపతి శ్రీనివాస్, కథా రచయిత్రి, విమర్శకురాలు ముదిగంటి శ్రీమతి సుజాతారెడ్డి, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు శ్రీ జి.ఎస్. వరదాచారి, దాశరథి అవార్డు గ్రహీత తిరుమల శ్రీ శ్రీనివాసాచార్య, బి.సి.కమిషన్ ఛైర్మన్ శ్రీ బి.ఎస్.రాములు, బి.సి.కమిషన్ సభ్యులు శ్రీ జూలూరి గౌరీశంకర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు శ్రీ జింబో (మంగారి రాజేందర్), సంస్కృతాంగ్ల పండితులు, విశ్రాంతాచార్యులు శ్రీ ఎస్.లక్ష్మణమూర్తి, కాళోజీ పురస్కార గ్రహీత శ్రీ అమ్మంగి వేణుగోపాల్, పద్యకవి, పండితులు శ్రీ గండ్ర లక్ష్మణరావు, శతావధాని శ్రీ గౌరీభట్ల మెట్రామశర్మ, పద్యకవి ఆచార్య ఫణీంధ్ర, సంస్కృత శతావధాని శ్రీ దోర్బల ప్రభాకరశర్మ, అష్టావధాని శ్రీ అయూచితం నటేశ్వర శర్మ, ఆచార్యులు ఆచార్య బన్న ఐలయ్య, ప్రముఖ కవి శ్రీ సీతారాం ఖమ్మం, ప్రజాగాయకులు శ్రీ గోరేటి వెంకన్న, కవి, వక్త శ్రీ కంచాల జయరాజ్, పరిశోధకుడు శ్రీ గుమన్నగారి బాలశ్రీనివాసమూర్తి, కవయిత్రి శ్రీ జూపాక సుభద్ర, ప్రముఖ రచయిత శ్రీ కె.వి. నరేందర్, ప్రముఖ రచయిత శ్రీ వరాల ఆనంద్, ప్రముఖ రచయిత శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ కవి శ్రీ వఝల శివకుమార్, ప్రముఖ కవి శ్రీ నాళేశ్వరం శంకరం, ప్రముఖ కవి శ్రీ కందుకూరి శ్రీరాములు, ప్రముఖ రచయిత శ్రీ ఐతా చంద్రయ్య, ప్రముఖ కవి శ్రీ తైదల అంజయ్య, ప్రముఖ కవి శ్రీ వేముగంటి మురళి, ప్రముఖ కథా రచయిత శ్రీ అయోధ్యా రెడ్డి, ప్రముఖ కవయిత్రి శ్రీమతి అనిసెట్టి రజిత, ప్రముఖ కవి శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి, ప్రముఖ కవి శ్రీ వనపట్ల సుబయ్య, ప్రముఖ రచయిత శ్రీ వి. శంకర్, ప్రముఖ రచయిత, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి, ప్రముఖ రచయిత శ్రీ కందికొండ, ప్రముఖ రచయిత శ్రీ గణపురం దేవేందర్, ప్రముఖ కవయిత్రి షాజహాన, పరిశోధకులు శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి యోగితారాణి తదితరులు పాల్గొన్నారు.

సాహితీ వేత్తలందరితో చర్చించారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి స్వరాష్ట్రం కోసం ఎట్ల పనిచేశారో, తెలుగు మహాసభలను విజయవంతం చేయడం కోసం కూడా అంతే పట్టుదలతో, సమన్వయంతో ముందుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు.

‘‘తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగింది. తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారు. ప్రతిభా పాటవాలకు కొదవలేదు. కానీ తెలంగాణ వారి ప్రతిభ రావాల్సినంతగా వెలుగులోకి రాలేదు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలి. ఎవరినో నిందించడానికి కాకుండా, తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటుకునేలా సభల నిర్వహణ ఉండాలి. అన్ని భాషా ప్ర్రక్రియలపై ప్రత్యేక కార్యక్రమాలుండాలి. చిత్ర లేఖనంతో పాటు ఇతర కళలకు ప్రాధాన్యత ఉండాలి. మన ప్రతిభ, గొప్పతనం వెలుగులోకి రావాలి. అముద్రిత గ్రంథాలను ముద్రించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలి. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలి. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలి. భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లుండాలి. వచ్చిన అతిథులకు మంచి వసతి, భోజనం కల్పించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలి. నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి, ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలి’’ అని సీఎం చెప్పారు.

‘‘తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే విశ్వాసం కలిగించాలి. తెలంగాణ ప్రభుత్వం 12వ తరగతి వరకు (ఇంటర్మీడియట్) తెలుగు సబ్జెక్టును ఖచ్చితంగా బోధించాలనే నిబంధన పెట్టింది. దీనికి సర్వత్రా ఆమోదం లభిస్తున్నది. ఉర్ధూ మీడియం స్కూళ్లలో కూడా ఈ విధానం అమలు చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. ఇది మంచి పరిణామం. తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరికే విధానం అమలు చేస్తాం. అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి. తెలుగులో విద్యార్థులకు సామాజిక అవగాహన, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలను బోధించాలి. కేవలం మహాసభలు నిర్వహించడమే కాకుండా, తెలుగు భవిష్యత్ కు సంబంధించిన సంకేతాలు కూడా మనం పంపించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

దాదాపు ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రతీ సాహితీ వేత్త చెప్పిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపిగ్గా విన్నారు. సభల నిర్వహణపై వారు చేసిన సూచనలకు సీఎం స్పందించారు. సభల నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కొన్ని ముఖ్య సూచనలు చేశారు:
– ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఒక రోజు తెలంగాణ తెలుగు సభ నిర్వహిస్తాం
– తెలంగాణలో వారసత్వంగా వస్తున్న మౌఖిక సాహిత్యాన్ని గ్రంథస్తం చేయాలి
– సభల నిర్వహణకు సాహితీ వేత్తలతో ఉప సంఘాలు వేయాలి
– మహాసభల వేదికపై ఖచ్చితంగా మహిళా సాహితీవేత్తల ప్రాతినిధ్యం ఉండాలి
– లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభ, ముగింపు సమావేశాలు నిర్వహించాలి. అక్కడే తెలుగు శాసనాలను ప్రదర్శనకు పెట్టాలి
– తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులు తెలుగులో ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
– మహాసభల్లో భాగంగా తెలుగు సినీ కవులు రాసిన పాటలతో సినీ సంగీత విభావరి ఏర్పాటు చేయాలి
– ముఖ్య కూడళ్లకు తెలంగాణలోని తెలుగు భాషా ప్రముఖుల పేర్లు పెట్టాలి
– మహాసభల సందర్భంగా ఇతర భాషల్లోని ప్రముఖులను గుర్తించి, సన్మానించాలి
– ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రముఖుల జీవిత గాథలతో పుస్తకాలు ముద్రించాలి