భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ - Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సారస్వత పరిషత్తులో నిర్వహించిన తెలుగుమహాసభలకు హాజరై అక్కడ భోజన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వివిధ వేదికల వద్ద ఏర్పాటు చేసిన భోజనకేంద్రాల్లో 14 వేల మంది అతిథులకు నిర్వాహకులు భోజనం వడ్డించారు. రాష్ట్ర ప్రభుత్వకార్యదర్శి ఎస్పీ సింగ్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అతిథులు బస చేసిన విడిది, భోజన కేంద్రాలను పరిశీలించారు. భోజనం చేసిన వారితో మాట్లాడి రుచి గురించి, మెనూ గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఎలాంటి భోజనాలు కావాలి, తినుబండారాల్లో ఏమైనా మార్పులు చేయాలా? అంటూ ఆరాతీశారు. తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న అన్ని వేదికలకు సాహిత్యాభిమానులు, భాషాభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

saraswatha-parishat-2

తెలుగు మహాసభలకు ఆదివారం హాజరైన అతిథులకు జీలకర్ర అన్నం, బీరకాయ కూర, టమాటా కూర, మునక్కాడల కూర, మెంతుల పులుసు, వంకాయ సోగి, పుంటికూర పప్పు, దోసకాయ తొక్కు, పచ్చిమిరపకాయ తొక్కు, పచ్చిపులుసు, కందగడ్డ పులుసు, పెసర గారెలు, బూందీ లడ్డు, కద్దుకా హల్వా, చపాతి వడ్డించారు. ప్రతిరోజు మాదిరిగా ఫ్రూట్ సలాడ్, పిండివంటలు, సకినాలు, సర్వపిండి, సల్ల మిరపకాయలు, పాపడాలు, మూడు రకాల నెయ్యి పొడులు, మూడురకాల తొక్కులు, పప్పుచారు, కట్‌మిర్చి, పెరుగు వడ్డించారు.

సోమవారం మెనూ
ప్రపంచ తెలుగు మహాసభల నాలుగోరోజు (సోమవారం) భోజనం కోసం పౌరసరఫరాలశాఖ మెనూలో ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేసింది. బగారా అన్నం, క్యాప్సికమ్ కూర, ఆనపకాయ పప్పు, కలగూర, ఆలుగడ్డ వేపుడు, గంగవాయిలికూర, మామిడికాయ పప్పు, టమాట తొక్కు, బీరకాయ తొక్కు, పచ్చిపులుసు, సల్లచారు, మక్క గారెలు, ఖుబానీ కా మీఠా, ఐస్‌క్రీం, జొన్న రొట్టె ఆహూతులకు సిద్ధం చేస్తున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-who-oversees-the-arrangements-of-the-meal-1-2-562367.html