విశ్వభాషలందు తెలుగు లెస్స - World Telugu Conferneces 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

విశ్వభాషలందు తెలుగు లెస్స

telugu-mahasabalu
తెలుగు ప్రభ దేదీప్యంగా వెలుగుతున్నది! రాజధాని నగరంలోని ఏడు వేర్వేరు వేదికలపై నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటిచెప్తున్నాయి! తొమ్మిదో శతాబ్దకాలానికే తెలంగాణలో చందోగ్రంథం వచ్చిన సంగతులు ప్రస్తావిస్తూ.. అంతకుపూర్వమే ఇక్కడ సాహిత్యం విలసిల్లిందనే వాస్తవాలు వివరిస్తూ.. తెలంగాణ భాషాసాహిత్యాల వైభవాన్ని ఇక్కడి బిడ్డలేకాదు.. దేశవిదేశాల నుంచి వచ్చిన భాషాభిమానులుసైతం ఎలుగెత్తిచాటుతున్నారు! తెలంగాణలోని సంకీర్తనాచార్యులు, దాస కవుల సాహిత్యం గురించి.. ఇక్కడి వివిధ కాలాల్లోని శతక, గేయ సాహిత్యం గురించి స్ఫూర్తిదాయకమైన చర్చలు.. మరోసారి ఆసక్తిగా సాగిన మెట్రామశర్మ శతావధానం.. అనేక పుస్తకాల ఆవిష్కరణలు.. వాటిని కొనుగోలు చేసేందుకు వివిధ పుస్తకాలయాల వద్ద బారులు తీరిన అభిమానులు.. వీటన్నింటి నడుమ తారలు దిగివచ్చిన వేళ పాల్కురికి ప్రాంగణంలో కాంతులీనిన సినీ సింగిడి.. ప్రేక్షకులను కట్టిపడేసిన సినీ సంగీత విభావరి.. అద్భుతంగా సాగుతున్న బృహత్ కవి సమ్మేళనం.. మొత్తంగా ప్రపంచ మహాసభల్లో నాలుగవ రోజైన సోమవారం కార్యక్రమాలు ఆద్యంతం ఉత్తేజంతో సాగాయి. ఈ నాలుగు రోజుల స్ఫూర్తిని కొనసాగిస్తూ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొనే ఉత్సవంతో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. పేరుకు మహాసభలు ముగిసినా.. దాని ప్రేరణ నిత్యజ్వలితంగా ఉండబోతున్నది. ఇంతటి దిగ్విజయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవే కారణమని నాలుగో రోజు ఆయా వేదికలపై మాట్లాడిన ప్రముఖులు కొనియాడారు.

భాషాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి ఈ సభలు తోడ్పడుతాయని పేర్కొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్సగా ఇప్పటిదాకా చెప్పుకొన్నా.. ఇప్పుడు విశ్వభాషలందు తెలుగు లెస్స.. అనిపించేలా సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. తెలుగు యూనివర్సిటీలోని సామల సదాశివ వేదికపై సోమవారం నిర్వహించిన తెలంగాణ సాహితీ విమర్శ- పరిశోధన చర్చలో పాల్గొన్న స్పీకర్.. తెలంగాణలో కాకతీయుల గురించి ఒక పుస్తకం రాయాలని సంకల్పించానని, త్వరలోనే దానిని పూర్తి చేస్తానని ప్రకటించారు. ఇదే వేదికపై మధ్యాహ్నం నిర్వహించిన శతక, సంకీర్తన, గేయ సాహిత్యం సదస్సులో తెలంగాణకు చెందిన సంకీర్తనాచార్యులు, దాస కవుల సాహిత్యం, వివిధ కాలాల్లోని శతక, గేయ సాహిత్యం గురించి చర్చించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సుల్లో తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీ, రచయితలు ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధాని పంచానన గౌరీభట్ల మెట్రామశర్మ పృచ్ఛకుల సమస్యలను పూరిస్తూ పద్యాలు పఠిస్తుంటే శ్రోతలు ఆసక్తిగా ఆలకించారు. గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగ ణం (రవీంద్రభారతి)లోని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగుపై నిర్వహించిన చర్చలో మాట్లాడిన పలువురు వక్తలు.. భాషను బతికించుకుందామని పిలుపునివ్వడంతోపాటు.. దాని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

ఇదే వేదికపై ఉదయం న్యాయ, పరిపాలనరంగాలలో తెలుగు పై సదస్సు నిర్వహించారు. పాల్కురికి సోమనాథుడి ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)లో బమ్మెర పోతన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన తెలంగాణ పాట జీవితంపై సాహితీ చర్చ ఉత్సాహవంతంగా జరిగింది. సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వికాసంలో ప్రపంచ తెలుగు మహాసభలు తొలి మెట్టని అభివర్ణించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక సమావేశం, సినీ సంగీత విభావరి అలరించాయి. తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖ నటులు, దర్శకులు, రచయితలు హాజరై.. తెలుగు మహాసభల నిర్వహణపై తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు భాష అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇక అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం (ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం)లో బృహత్‌కవి సమ్మేళనాలు సోమవారం కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. పలు దఫాలుగా నిర్వహించిన తొమ్మిది కవి సమ్మేళనాల్లో కవులు సార్వజనీన, సమకాలిక అంశాలతో కవితామాలికలు అల్లారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cini-sangeetha-vibhavari-in-telugu-mahasabhalu-1-2-562464.html