బాటలు వేసిరి మన కవులే - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

బాటలు వేసిరి మన కవులే

తెలుగు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేసి, ఆ వినీలాకాశంలో చెరగని ధ్రువతారలై వెలుగులీనిన సాహితీవతంసులెందరో మన తెలంగాణకు సంబంధించిన వారు కావడం మనమంతా గర్వంగా చెప్పుకోదగిన అంశం. వీళ్ళ గురించి, వీళ్ళ సాహిత్యం గురించీ శ్రద్ధ వహించి, ముందుతరాలకు అందిచడం మన విధి.

Default post image
అనేక ప్రక్రియలకు ఆద్యుడై, స్వతంత్ర పురాణ నిర్మాత యై, ఆదికవి అనే మాటకు ప్రత్యక్ష నిదర్శనమైన కవి మన తెలంగాణలోనే జన్మించినాడు. మొట్టమొదటి సంస్కృతాంధ్ర కవితా పితామహ అన్న బిరుదు వహించిన అమాత్యశేఖరుడు ఈ గడ్డ మీదనే ప్రభవించినాడు. మొదటి వచనాలను తెలుగులో వెలువరించిన కవీంద్రుడు ఇక్కడనే పుట్టినాడు. పురాణాలను ఆంధ్రీకరించడం ప్రారంభమైందీ ఇక్కడనే. తొట్ట తొలి రామాయణం ఊపిరిపోసుకున్నది తెలంగాణలోనే. మొదటి సంకలన గ్రంథం తెలంగాణలోనే వన్నెలద్దుకున్నది. నాటక సాహిత్యానికి ప్రేరణనిచ్చిన గ్రంథ రచన ఈ నేలలోనే ఆవిర్భవించింది. ప్రబంధ సాహిత్యం ప్రభవించిందీ ఈ సీమలోనే. తొలి సం యుక్త రచనకు భూమికగా నిలిచినదీ ఈ తెలంగాణే. కావ్యాన్ని విజ్ఞాన సర్వస్వంగా మలిచిన తొలి ప్రయత్నం చేసిన సహృదయ కవీంద్రులూ ఇక్కడివారే. తొలి అచ్చ తెలుగు కావ్యానికి ఆయువుపట్టు ఈ భూమి. మొదటి చారిత్రక రచనను జగతికందించిన తెలుగు రచయిత మనవాడే. భర్తృహరి సుభాషితాలను మొదటిసారి తెలుగులోకి అనువాదం చేసిన కవీంద్రుడూ తెలంగాణలో జన్మించిన వాడే. రేడియోలో తొలి ప్రసంగం చేసిన గౌరవం తెలంగాణ వక్తదే. తెలుగు సినిమాకు మొదటి పాట రాసిన ప్రతిభ మనవాళ్ళదే. ఉర్దూ గజల్‌ను, రుబాయీలనూ తెలుగు వాళ్ళకు పరిచ యం చేసిన కవి వతంసులూ ఇక్కడివారే. అంతెందుకు? సంస్కృతానికి అమ్మ, తెలుగుకు అమ్మమ్మా అయిన ప్రాకృత భాషలో తొలి కవితా సంకలనం విడుదలచేసిన శాలివాహన హాల చక్రవర్తి కూడా ఇక్కడి వాడే! పై అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఆశ్చర్యం, ఆనందం, గర్వం కలుగుతాయి. తొలి శిలాశాసనం మొదలు ఇప్పటివరకు అత్యధిక సాహిత్య ప్రక్రియలకు తెలుగులో ఆద్యులైన మహనీయ కవులెందరో మనకు సాక్షాత్కరించి మనసులను పులకరింపజేస్తారు. వేల సంవత్సరాల సాహిత్య చరిత్రను ఒక్కసారి మననం చేసుకున్నప్పుడు ఈ విషయం తేటతెల్లమై ప్రతి తెలంగాణ బిడ్డ గుండె పొం గిపోతుంది.

తరతరాలుగా సాగిన వలస పాలన పుణ్యమాని తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం, ప్రతిభ, చరిత్ర… సమస్తమూ నిర్లక్ష్యానికి, ఉపేక్షకూ గురై, ఉనికినే విస్మరించే ప్రమాదంలో పడ్డాయి. తెలంగాణ ఆవిర్భావంతో అన్నిరంగాల్లో దిద్దుబాటు చర్యలు మొదలైనై. మసి అంటిన మాణిక్యాలు-పులు కడిగిన ముత్యాలు గా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు ఈ గడ్డ మీద జరుగుతుండటంతో తెలుగు సాహిత్యంలో మన స్థానమేదో సింహావలోకనం చేసుకునే అవకాశం అరచేతిలో ఉసిరిగాయ తీరున మనకు దక్కింది. వందల సంవత్సరాల నుంచి తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, ఉనికి కోసం, ఊపిరి కోసం పోరాటం చేస్తూనే ఉన్నది. పరిశీలించి చూస్తే సాహిత్యంలో కూడా ఇటువంటి ధోరణి కనిపిస్తుంది. ఆకాశమంత ఆవేశం-సముద్రమంత ప్రతిభావ్యుత్పత్తులతో తెలుగులో అనేక ప్రక్రియలను ప్రారంభించి నిజమైన ఆది కవిగా శాశ్వత కీర్తినార్జించిన పాల్కురికి సోమనాథ కవీంద్రుడు మొదలు నిన్నమొన్నటి కాళోజీ, దాశరథి, సినారె… నేటి ఆచార్య ఎన్.గోపి, నందిని సిధారెడ్డి, వనపట్ల సుబ్బయ్య దాకా ఈ స్వభావం మనకు కనిపిస్తుంది. ఈ నడుమ ఎన్నో ఎన్నెన్నో మైలురాళ్లు మన కవులు నిలబెట్టిపోయినారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆ మహనీయులను ఒక్కసారి గుర్తుచేసుకోవడం ఎంతైనా అవసరం. సంస్కృతం దేవ భాష అని, సంస్కృత సమాస భూయిష్టమైనదే శిష్టభాష అని, అనువాద రచనే అసలు రచనని, వైదిక సంప్రదాయమే విశిష్టమైనదని, గిరిగీసుకొని, రాజాస్థానాల పంజరాల్లో బంగారు చిలుకగా బంధించిన మెరుగు తెలుగును-జాను తెనుగ ని నిరూపించి, స్వతంత్ర పురాణాన్ని (బసవ పురాణం)-ప్రజలు పాడుకోగలిగే ద్విపదలో నిర్మించి, పండిత పామరుల నీరాజనాలందుకున్న అసలైన మహాకవి, ఆదికవి పాల్కురికి సోమనాథు డు. అంతమాత్రం చేత తన ప్రతిభ సామాన్యమైందిగా భావించనవసరం లేదని నిరూపిస్తూ-సంస్కృతం, కన్నడం, మరాఠీ, తమి ళ, హిందీ భాషల్లో పద్యరచన చేసిన అసమాన ప్రతిభా సంపన్ను డు సోమనాథుడు. సంస్కృతం నుంచి అనువాదం చేయడం కాదు. తన రచనలను సంస్కృత భాషలోకి అనువదించేటట్లు చేసిన (ఉదాహరణ కావ్యం) ఘనుడాయన. ఇక కాకతీయ సామ్రాజ్య సంక్షేమానికి, విస్తరణకు, పటిష్టతకూ తన జీవితాన్ని అంకితం చేసిన శివదేవయ్యమంత్రి గొప్ప సాహితీవేత్త అన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. సంస్కృతాం ధ్ర కవితా పితామహుడుగా బిరుదు వహించిన శివదేవయ్య విశిష్ట రచనలు పురుషార్థసారము, శివదేవధీమణి శతకము.

స్తుతి వచనాలు అనే గద్య ప్రక్రియకు తెలుగులో శ్రీకారం చుట్టిన సత్కవీంద్రుడు కృష్ణమాచార్యులనే భక్త శిఖామణి. ఈయన మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించి, సింహగిరికి చేరి, అక్కడ స్వామివారి అనుగ్రహంతో నాలుగు లక్షల వచనాలు రాసినాడనేది ఐతిహ్యం- (ప్రస్తుతం 62 మాత్రమే లభ్యం) తర్వాత ఈ కవిని ప్రతాపరుద్ర చక్రవర్తి అభిమానించి ఆదరించి అగ్రహారాన్ని (కనకగిరి) ప్రదానం చేసినాడు. కృష్ణమాచార్యుల సింహగిరి వచనాలు తెలుగులో తొలి వచనాలు. అల్లసాని పెద్దన తొలి ప్రబంధకర్త అని, ఆంధ్ర కవితా పితామహుడని బిరుదుగాంచినాడన్న ప్రచారంలోనే తెలుగు వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు. కానీ, అంతకుముందే అంటే 15వ శతా బ్ది ప్రారంభంలోనే ఎనుముల పల్లి పెద్దనామాత్యుడు చిత్రభార తం అనే ప్రబంధాన్ని రచించి, చిత్తాబుఖానుకు అంకితం గావించినాడు. మార్కండేయ పురాణాన్ని అనువాదం చేసి, పురాణాంధ్రీకరణకు శ్రీకారం చుట్టిన మారన మన తెలంగాణలో జన్మించినవాడే. గన్నయ మహాసేనానికి ఆప్తమిత్రుడై అతనికే ఈ కావ్యాన్ని అంకితం చేసిన మారన తిక్కన మహాకవి శిష్యుడుగా ప్రసిద్ధుడు. ఓరుగల్లులో జీవించినవాడు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన కీర్తి కూడా మన తెలంగాణ కవులదే. గోన వంశస్థుడైన బుద్ధారెడ్డి రాయచూరు సీమను పరిపాలించిన ప్రముఖుడు. అది ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. బుద్ధారెడ్డి కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగం. ఆ సత్కవీంద్రుడు ద్విపదలో తన తండ్రి విఠల రంగనాథుని పేర రంగనాథ రామాయణం రాసి నుతికెక్కినాడు. తెలుగులో ఇదే తొలి రామాయణం కావడం గమనార్హం. తెలుగు ఛందశ్శాస్ర్తాన్ని సంస్కృతంలో వివరించిన విశేష శేము షీ సంపన్నుడు గౌరన. దేవరకొండ ప్రాంతానికి చెందిన ఈ కవీంద్రుని లక్షణ శాస్ర్తానికి 50 ప్రామాణిక గ్రంథాలున్నాయి. ఈయన ఋగ్వేదం ఆధారంగా రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం సుప్రసిద్ధమై నాటక శైలికి అత్యంత సమీపంగా ఉండటం వల్ల అది తదనంతరకాలంలో నాటకాలుగా రూపుదిద్దుకున్నది. అందులో హరిశ్చంద్రుని భార్య పేరు చంద్రమతిగా నామకరణం చేసిందీ గౌరనే.
సంస్కృత సమాస భూయిష్ట రచనే విశిష్టమనుకునే కాలంలో అచ్చంగా తెలుగులో కావ్యాన్ని రచించి మచ్చలేని కీర్తితెచ్చుకున్న పొన్నగంటి తెలగన తెలంగాణ కవి. ఇప్పటి పటాన్‌చెరువు (సంగారెడ్డి జిల్లా) ఆయన జన్మస్థలం. 16వ శతాబ్దికి చెందిన ఈ కవి తన యయాతి చరిత్రము కావ్యాన్ని ఇబ్రహీం కులీకుతుబ్ షా వద్ద మంత్రిగానున్న అమీనుఖానుకు అంకితమొనర్చినాడు.

13 శతాబ్ది చివర జీవించి ఉన్న కుమార రుద్రుడు, మల్లికార్జునభట్టు, అయ్యలభట్టు, హుళక్కి భాస్కరునితో కలిసి భాస్కర రామాయణ నిర్మాణం ఒక చారిత్రక విశేషం. ఆ కాలంలోనే సం యుక్త రచనకు శ్రీకారం చుట్టిన ఈ కవులు ప్రశంసనీయులే కదా. ఈ కవి చతుష్టయం కాకతీయ సామ్రాజ్యవాసులు. అదేవిధంగా భర్తృహరి సుభాషితాలను తెలుగువాళ్ళకందించిన మొదటి కవి ఎలకూచి బాలసరస్వతి మహబూబ్‌నగర ప్రాంతం వాడు. మొట్టమొదటి చారిత్రక రచన అందించిన ఏకామ్రనాథుడు (ప్రతాప చరిత్ర) ఓరుగల్లు నివాసి. అంతేకాదు తొలి సినీ గీతం భక్తప్రహ్లాద కోసం రాసిన చందాల కేశవదాసు తెలంగాణ ప్రముఖ కవి, వాగ్గేయకారుడు. తమ్మెర (నల్గొండ)లో జీవించిన ఈ భక్త శిఖామణి 19వ శతాబ్దికి చెందినవాడు. రేడియోలో తొలి ప్రసం గం చేసిన ఆదిరాజు వీరభద్రరావు పరిశోధన భీష్ముడుగా పేరు గాంచినవాడు. ఆయన పుట్టింది ఖమ్మం జిల్లాలో-జీవితమంతా గడిపింది హైదరాబాద్‌లో. ఈ విధంగా తెలుగు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేసి, ఆ వినీలాకాశంలో చెరగని ధ్రువతారలై వెలుగులీనిన సాహితీవతంసులెందరో మన తెలంగాణకు సంబంధించిన వారు కావడం మనమంతా గర్వంగా చెప్పుకోదగిన అంశం. వీళ్ళ గురించి, వీళ్ళ సాహిత్యం గురించీ శ్రద్ధ వహించి, ముందు తరాలకు అందించ డం మన విధి. రాష్ట్ర ప్రభుత్వం, సాహిత్య అకాడమీ ఈ విషయం మీద దృష్టిపెట్టడం అభినందనీయం.
– దోరవేటి, 9866251679

Source: https://www.ntnews.com/Literature/article.aspx?category=4&subCategory=1&ContentId=494369