అమ్మ భాషకు అభివందనం - World Telugu Confernces 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అమ్మ భాషకు అభివందనం

amma-bhashaku-abhivandanam
తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలనే సమున్నత లక్ష్యం. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు ఈనెల 15 నుంచి 19 వరకూ జరుగనున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహాసభల ద్వారా తెలుగుకు ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది.. పాలనా భాషగా అమలు జరిపేందుకు ఏ విధంగా తోడ్పడుతుంది.. కొత్త తరానికి తెలుగుపై ఎలాంటి అవగాహన కల్పించనుంది.. ఇంటా, బయటా తెలుగు వెలుగులు ప్రసరించడానికి మహాసభలు ఎలాంటి ప్రేరణను అందిస్తాయి.. తదితర అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ’ ‘తెలుగు వైభవం’ పేరిట ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న భాషావేత్తలు, భాషా నిపుణులు మాట్లాడుతూ.. మాతృభాషను గౌరవించి, దైనందిన కార్యకలాపాల్లో ఉపయోగించటం ద్వారా తెలుగుకు పునర్‌వైభవం వస్తుందన్నారు. భవిష్యత్తు తరానికి అమ్మపట్ల ఉండే ప్రేమనే మాతృభాషపై కలిగేలా చూడాల్సి ఉందంటూ తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచ తెలుగు మహాసభలు మాతృభాషకు పట్టం కట్టేందుకు అవసరమైన వేదిక అని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.వి.సత్యనారాయణ అన్నారు. ముప్పై ఏళ్లక్రితమే ఏర్పాటైన సాహిత్య అకాడమీకి పునర్‌వైభవం తీసుకురావటంతోనే దీనికి అంకురార్పణ జరిగిందన్నారు. 1-12వ తరగతి వరకూ తెలుగును పాఠ్యాంశంగా చేయటం ద్వారా ప్రభుత్వం భాషకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. మహాసభలు ముగిశాక నివేదికలు ఆవిష్కరించి వదిలేసే రోజులు మారాయన్నారు. తెలుగు భాషా పండితులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదు గంటలపాటు మాట్లాడిన తర్వాత మహాసభలకు రూపకల్పన జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది అక్షర వెలుగుకు ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ.. పరభాషల నుంచి వచ్చిపడుతున్న పదాలకు సమానమైన అర్థాన్ని వెదకాలని కోరారు. అక్షరాస్యతను పెంపొందించేందుకు మాతృభాషను మించిన సాధనం లేదని పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్‌బాబు మాట్లాడుతూ స్వయంగా సీఎం కేసీఆర్‌ తెలుగుభాష పండితుడు కావటంతో భాషకు మున్ముందు మంచి రోజులు వచ్చేందుకు కారణమన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోట నామఫలకాలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భాషా శాస్త్రవేత్త ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక యుగంలో అంతర్జాలం ద్వారా తెలుగు పదాలకు రూపమిచ్చేందుకు ఎంతోమంది యువత చొరవ చూపటం శుభపరిణామంగా పేర్కొన్నారు. భాష గురించి ప్రశంసలు కురిపిస్తూ మురిసిపోవటం కాకుండా క్షేత్రస్థాయిలో అమలుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని కోరారు. కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. క్రీస్తుపూర్వమే తెలుగు భాష విలసిల్లిందనేందుకు తెలుగునేలపై బయటపడుతున్న శాసనాలే సాక్ష్యాలన్నారు. పాఠ్యాంశంగా శాసనాలను ప్రవేశపెట్టాలని కోరారు. మాతృభాషకు అమ్మఒడి తొలి వేదిక అని తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, రచయిత్రి జూపాక సుభద్ర అభివర్ణించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సాహితీ పురస్కార గ్రహీత వసునూరి రవీందర్‌ మాట్లాడుతూ తెలంగాణలో సాహిత్యం ఉద్యమం నుంచి ఉద్భవించిందన్నారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ తెలుగును పాఠ్యాంశంగానే కాకుండా వాడుకలో వృద్ధి చేసేలా తల్లిదండ్రులు వ్యవహరించాలని సూచించారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=5