వాద్య సంగీత, నృత్యరూపకాలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

వాద్య సంగీత, నృత్యరూపకాలు..

తెలంగాణ సాహిత్య నీరాజనంతో తెలుగు సరస్వతి పులకించిపోయింది. శతాబ్దాల అనంతరం తమకు, తమ రచనలకు పున: ప్రాభవాన్ని తీసుకొచ్చిన ప్రపంచ తెలుగు మహాసభలను చూసి దివిజ కవివరులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, మల్లీయ రేచన, మల్లినాథసూరి, పొన్నగంటి తెలగన వంటి మహామహులు.. ఆకాశం నుంచి నక్షత్ర వెలుగు కాంతులతో ఆశీస్సులందించారు. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు..రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిభాషణంతో సుసంపన్నమయ్యాయి. పాల్కురికి సోమనాథుడి ప్రాంగణం (లాల్‌బహదూర్ క్రీడా మైదానం)లోని బమ్మెర పోతన వేదికగా ప్రారంభమైన ఈ మహాసభలు పలు వేదికలపై వందకు పైగా సదస్సులు, విస్తృతమైన చర్చాగోష్ఠులతో తెలుగు భారతి ఔన్నత్యానికి దశదిశలను చూపించాయి. ఒక వేదికపై సదస్సులు.. ఒక వేదికపై శతావధానం.. ఒక వేదికపై లఘుచిత్ర ప్రదర్శనలు.. ఒక వేదికపై ఆట పాటల సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా.. అన్ని ప్రక్రియలు.. అన్ని రూపాల్లో విలసిల్లిన తెలుగు సాహిత్యానికి ఈ మహాసభలు దర్పణం పట్టాయి. ఈ సభలకు 8వేలమంది ప్రతినిధులు వస్తారని ముందుగా భావించినప్పటికీ.. ఆ సంఖ్య 16వేల మందికి చేరింది. 42 దేశాల నుంచి దాదాపు 450మంది విదేశీ ప్రతినిధులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. దాదాపు 250 పుస్తకాలను అనేక మంది ప్రముఖులు ఆవిష్కరించారు. భాషా ప్రేమికుల మనోభావాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిలువుసంతకంలా మారారు.

వివిధ రూపాల్లో అవధానాలు.. వివిధ ప్రక్రియల్లో కవిసమ్మేళనాలు అద్భుతంగా జరిగాయి. నాలుగు రోజుల పాటు నిరాటంకంగా సాగిన బృహత్‌కవిసమ్మేళనంలో వందల మంది కవులు తమ కవితాగానాన్ని చేశారు. అన్ని వేదికలపై సాగిన మొత్తం కవి సమ్మేళనాలలో 1500మందికి పైగా కవులు పాల్గొనడం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని సన్నివేశం. తెలంగాణ ప్రభుత్వం.. ఈ సభల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కవిని, రచయితను, సాహిత్య వేత్తలను, పండితులను, వివిధ రంగాల ప్రముఖులను సముచిత రీతిలో సత్కరించింది. రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ మహాసభల్లో పాల్గొనడానికి ఉత్సాహంతో వచ్చారు. ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా.. ఎవరికీ అసౌకర్యం వాటిల్లకుండా అద్భుతమైన ఆతిథ్యాన్ని నిర్వాహకులు అందించారు. సమాపనోత్సవంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగత వచనాలలో పేర్కొన్నట్లుగా భవిష్యత్‌లో ఎవరు మహాసభలు నిర్వహించినా వారికివి మార్గదర్శకంగా మారాయి. తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రకటించగలిగామని సిధారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు.

madhusudan

వెలుగు జిలుగుల విన్యాసాలు
వినువీధుల్లో తెలుగు వెలుగులు విరజిమ్మాయి. ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం మంగళవారం సాయంత్రం అత్యద్భుతమైన వాద్య, సంగీత, నృత్య విలాసాలతో.. పటాకుల మోతతో సమ్మిళితమై పరమాద్భుతంగా సాగిన లేజర్ షోతో నభూతో నభవిష్యతి అన్నట్లుగా జరిగింది. తెలంగాణ సాహిత్య వైతాళికుల ఘనకీర్తిని చాటి చెప్పే విధంగా రూపొందించిన తెలంగాణ వైభవం నృత్యరూపకంతో ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీరాముడు పలికించిన భాగవతమట.. అనే పల్లవితో పోతన్నను, ద్విపద కావ్య పదాలతో సోమన్నను, తెలుగు ప్రాచీనతకు నిలువెత్తు సాక్ష్యమై నిలిచిన జినవల్లభుని కంద పద్యాలను, ఉదహరిస్తూ తెలంగాణ వైభవం నృత్య కళారూపం సాగింది. తర్వాత నృత్య కళాకారిణి దీపికారెడ్డి నృత్య దర్శకత్వంలో రూపొందించిన జై జై తెలుగు ప్రపంచ మహాసభలు నృత్య కళారూపం సభకు వచ్చిన వారందరినీ ఆనంద పరచింది. అనంతరం శ్రీమన్మహారాజ రాజాధిరాజ.. గణపతి మహరాజ సేవిత.. సర్వ శుభంకర.. స్వయంభూలింగ దేవర అంటూ.. కాకతీయ ప్రభువుల కాలం నాడు వెల్లి విరిసిన పేరిణి లాస్య నాట్య విన్యాసాన్ని రాష్ట్రపతి కోవింద్ సభలోకి ప్రవేశించగానే ప్రదర్శించారు. రాష్ట్రపతి ఆశ్చర్యంతో, ఆనందంతో పేరిణి లాస్య విన్యాసాన్ని తిలకించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియంలో లేజర్ వెలుగుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంతోపాటు వాద్య సంగీతంతో కూడిన వెలుగుజిలుగులు అందరినీ కట్టిపడేశాయి. మైదానం అంతా విస్తరించిన లేజర్ షోను వీక్షకులు తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించడం కనిపించింది. శివమణి ఏకతాళంలో లయధ్వనులు మార్మోగుతుండగా.. లేజర్ షో కిరణ వెలుగులు ఆకాశంలో నక్షత్ర మాలికలయ్యాయి. సప్తవర్ణాల కాంతులు ఆకాశమంతటా ఆవరించిన ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రేక్షకులకు రెండు కండ్లు చాలలేదు. చిన్నారులు, పోలీసులు, పోలీసు అధికారులు, ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు.

భాషను పరిరక్షించుకొందాం వాలంతరి చైర్మన్ వీ ప్రకాశ్
తెలుగు భాషను బతికించుకొని, ఆత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (వాలంతరి) చైర్మన్ వీ ప్రకాశ్ పిలుపునిచ్చారు. రాష్ర్టేతర తెలుగు వారి భాషా సాంస్కృతిక విషయాలపై యశోదారెడ్డి ప్రాంగణంలో జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణతోపాటుగా ఇతర రాష్ర్టాల్లో ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇతర రాష్ర్టాలలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను ఆయన సత్కరించారు.

ఒకే కుటుంబమనే భావన
ప్రాచీనమైన తెలుగుభాష మూలాలను, తెలుగు సాహిత్య వికాసాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మహాసభలు గుర్తుచేస్తున్నాయి. ఈ తరానికి తెలు గు మహాసభలు ఓ సందేశం. ప్రపంచంలోని తెలుగువారంతా ఒకే కుటుంబం అనే భావనను పెంపొందించేలా మహాసభలను నిర్వహించడం సంతోషాన్నిచ్చింది.
– డాక్టర్ కపిలవాయి లింగమూర్తి, భాషావేత్త

సీఎం కేసీఆర్ ధన్యులు
భాష కోసం, సంస్కృతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తుంటే ఇతర ప్రాంతాల తెలుగు వారికి కూడా సంతోషం కలుగుతున్నది. ఎక్కడైతేనేం మా తెలుగుకే కదా పండుగ అన్న సంతోషంతో ఉన్నారు. తెలుగుభాష, సంస్కృతిపై ఆదరణ చూపే కేసీఆర్ ధన్యులు. వారి కృషి భవిష్యత్‌లోనూ కొనసాగాలి.
– మాడుగుల నాగఫణిశర్మ, సుప్రసిద్ధ అవధాని

ఇదే స్ఫూర్తి కొనసాగాలి
తెలుగువారందరి కోసం మహాసభలు ఒక స్ఫూర్తివంతమైన వాతావారణం నెలకొల్పాయి. మహాసభల్లో ప్రవాసతెలుగు వారి సమస్యలపై దృష్టి సారించడం సంతోషంగా ఉంది. ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో ఉండే తెలుగువాళ్లు భాషాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాతృభాషకు దగ్గరవ్వాలని,సంస్కృతిని కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు.
– రఘు చామర్తి, మనబడి కన్వీనర్ (అమెరికా)

కవులను గుర్తుచేశాయి
తెలుగు మహాసభలు సంతోషాన్ని కలిగించాయి. మరిచిపోయిన కవులను సమాజానికి గుర్తుచేశాయి. ఈ సభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ తట్టిలేపాయి. అనేక సభా వేదికలపై విభిన్న సాహితీ ప్రక్రియల గురించి నిర్వహించిన చర్చలు బాగున్నాయి. మరిచిపోతున్న అవధానం, పద్యకవితా ప్రక్రియలను చాలా బాగా నిర్వహించారు.
– పార్వతమ్మ, మొల్ల సాహితీ కేంద్రం (కడప)

naatyam

తెలుగుసభలు జరుగుతూ ఉండాలి
ప్రపంచంలో మనం ఎక్కడికి పయనించినా మన మూలాలను ఎప్పుడో ఒకప్పుడు గుర్తుచేసుకుంటాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మమ్మల్ని గుర్తుచేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఆహ్వానించి, ఆత్మీయమైన ఆతిథ్యంతో మమ్మల్ని గౌరవించారు. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ఆలంబన కావాలి. తెలుగు సభలు ఇలాగే జరుగుతూ ఉండాలి.
– ఆనంద్ కూచిబొట్ల, సిలికానాంధ్ర అధ్యక్షుడు (అమెరికా)

మర్యాదలు బాగున్నాయి
అతిథి మర్యాదలు చాలా బాగున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడమే కాదు, లోటులేకుండా ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఇన్ని మర్యాదలుంటాయని ఊహించలేదు. ఎన్నడూ చూడలేదు కూడా. తెలంగాణ రుచులతో కమ్మని భోజనం పెట్టారు. ఆవశ్యకమైన అంశాలపై సాహితీ చర్చలు నిర్వహించారు.
– పీవీపీసీ ప్రసాద్, రాష్ర్టేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు (అహ్మదాబాద్)

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/amazing-laser-show-at-prapancha-telugu-mahasabhalu-closing-ceremony-1-2-562533.html