డిజిటల్ మీడియాతో తెలుగుభాషా విస్తృతి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

డిజిటల్ మీడియాతో తెలుగుభాషా విస్తృతి

డిజిటల్ మాధ్యమంలో తెలుగు ఉపయోగాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలుగుభాషా విస్తృతి మరింతగా పెరుగుతుందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ మాధ్యమంలో తెలుగు వాడుకను పెంచడానికి, తెలుగు వినియోగాన్ని సులభతరం చేయడానికి వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరుగుతున్న ప్రయత్నాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణ ఐటీశాఖకు చెందిన డిజిటల్ మీడియావిభాగం డిజిటల్ తెలుగు – డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుక, అభివృద్ధి అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకీకృత వెబ్ పేజీని ఆవిష్కరించారు. గోష్ఠిలో జయేశ్‌రంజన్ స్వాగతోపన్యాసం చేస్తూ, ఇంటర్నెట్ దశ-దిశను నిర్దేశించే ఐకాన్ (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) కొత్తగా 100 కోట్లమందికి ఇంటర్నెట్‌ను చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, ఇందుకోసం చేసే ఇంటర్నెట్ స్థానీకరణ ప్రయత్నాలకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు యూనికోడ్ ఫాంట్లను ఉపయోగించి తాము వెబ్ సైట్లను రూపొందిస్తున్నామని చెప్పారు. ఐటీ డిజిటల్ మీడియా విభాగం సంచాలకుడు దిలీప్ కొణతం మాట్లాడుతూ వ్యవసాయశాఖకోసం రూపొందిస్తున్న తెలుగు వెబ్‌సైట్ ఆవిష్కరణ త్వరలో జరుగుతుందని తెలిపారు.
DigitalTelugu

డిజిటల్ మీడియా విభాగం సహాయ సంచాలకుడు మాధవ్ ముడుంబై, సిలికానాంధ్ర ప్రతినిధి కూచిభొట్ల ఆనంద్, డిజిటల్ మాధ్యమంలో తెలుగువాడకంపై కృషి చేస్తున్న సుమారు 60 మంది ప్రముఖులు మాట్లాడారు. ఈ గోష్ఠిలో డిజిటల్ తెలుగు- పరిణామ క్రమం, నేటివరకు జరిగిన కృషి; బ్లాగులు, పత్రికలు, వికీపీడియా, ఈ-కామర్స్ వంటి ఆన్‌లైన్ వేదికల్లో తెలుగువాడకం; పదాలను శబ్దంగా మార్చే ప్రక్రియ (టెక్ట్స్ టు స్పీచ్), స్థానీకరణ (లోకలైజేషన్); డిజిటల్ తెలుగువాడుకను పెంపొందించే క్రమంలో ప్రభుత్వం, వ్యక్తులు, ఇతర సంస్థలు ఇకపై చేయవలసిన కృషి అనే నాలుగు ముఖ్యాంశాలపై స్థూలంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇచ్చిన సూచనలను ఐటీశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రపంచ ఇంటర్నెట్ సదస్సును ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించాలని, కొత్త తెలుగు ఖతులను, ఉపకరణాలను, అప్లికేషన్లను అభివృద్ధి చేసే వారికి సాయం అందించాలని, ఉద్యోగులు, రచయితలు, విలేకరులు, విద్యార్థులకు డిజిటల్ తెలుగువాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కొందరు సలహా ఇచ్చారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/agricultural-website-available-in-telugu-1-2-562358.html