తెలుగుభాష వికాసంలో జానపదుల అపురూప సేవ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగుభాష వికాసంలో జానపదుల అపురూప సేవ

తెలుగుభాష వికాసంలో జానపద సాహిత్యానికి విశిష్ట స్థానం ఉన్నది. తెలుగుభాష వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత జానపద సాహిత్యానిది. స్వరాష్ట్రమై వెలుగొందుతున్న తెలంగాణలో.. తెలంగాణ తెలుగు భాష వైభవాన్ని చాటిచెప్పేందుకు తెలుగు మహాసభలు ఒక వేదిక కాబోతున్నాయి. తెలుగు మహాసభలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఉదహరించుకోవడం సముచితం. శిష్టసాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. శ్రామికజనుల నోటినుంచి జాలువారిన అందమైన జానపద గీతాలు, ఆశుపరిమళాలు తెలంగాణను కాపాడుకుంటున్న సజీవ వారసత్వ సంపద ఇది అక్షరసత్యం. అనాదిగా తెలుగు భాషాసంస్కృతులు పరిఢవిల్లడానికి పల్లెటూళ్లే పట్టుగొమ్మలుగా నిలిచాయి. ఆదిమజాతుల కాలం నుంచి తమ భాషా సంస్కృతుల్ని కాపాడుకోవడానికి జానపదులు ఆయా కళారూపాల ద్వారా తమవంతు ప్రయత్నాలు కొనసాగించారు. పల్లెల్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గ్రామీణులే తమ ప్రాంత సంస్కృతి, సాంపద్రాయాలను సంరక్షించుకుంటున్నారు. పురాణేతిహాసాలు, కళలు, సాహిత్య రూపాలన్నింటిపైన వీరికి గట్టిపట్టుంది. ఇవన్నీ వీరికి తరతరాలుగా ఆయా కళారూపాల ద్వారా వారసత్వంగా సంక్రమించినవే. అక్షరజ్ఞానం అంతగా లేని రోజుల్లో దృశ్యశ్రవణ మాధ్యమాలు లేని కాలంలోనే మానవీయ విలువలను, భాషాసంస్కృతులను విధిగా ప్రచారం చేశారు. పొద్దంతా శ్రమించి ఆ కష్టాన్ని మరిచిపోవడానికి, అలసట నుంచి మనిషిని మానసిక ఉల్లాసం వైపు మళ్లించడానికి బాగోతాలు, యక్షగానాలు, రామాయణ మహాభారత నాటకాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, చిందు యక్షగానాలు, బీరప్ప కథలు, శారదకాండ్ల కథలు, బుడబుక్కలు, కాటికాపరులు, గంగిరెద్దులు, బాలసంతలు మొదలగువారు తమ జీవనవృత్తిగా అనేక కళారూపాలు ప్రదర్శించేవారు. ఇదేకాకుండా వ్యవసాయ సంబంధమైన పనుల్లో అక్షరజ్ఞానం లేని స్త్రీలు నాట్లేసే పాటలు, కలుపు పాటలు, దంచుడు పాటలు, కోతలు, మోతలు, కల్లాలు, ఇసురుడు పాటలు, పురుషులు మోట పాటలు, ఆయా పండుగ సందర్భాల్లో పాడే కాముని పాటలు, బతుకమ్మ, కోలాటం, పీర్ల గుండం చుట్టూ దుంకుతూ పాడే ఆలువ ఆటల్లోని పాటలు పాడుకునే వారు. ఇందుకు తమచుట్టూ జరుగుతున్న సంఘటనల నుంచి పాటను కైగట్టి పాడుకునే వారు.

Default post image

వీరు ప్రదర్శించే కళారూపాల్లోని ఆయా పాత్రల ద్వారా విలువలను, నీతిని పంచి సమాజ సంబంధాన్ని పటిష్ఠపరిచేవారు. అచ్చమైన తెలుగు నుడికారాలు, పదబంధాలు, సామెతలు, జాతీయాలు, జనబాహుళ్యంలో సజీవంగా నిలువడానికి కారణం జానపదుల గొప్పతనమే. వీరు నిరక్షరాస్యులైనప్పటికీ కావాల్సినంత భాషాపరిజ్ఞానం, భావవ్యక్తీకరణ సామర్థ్యం, భాషపై పట్టు ఉంటుందన్న సంగతి విస్మరించరాని నిజం. గొప్ప పలుకుబడులు, సంకేతాలు, విశిష్టమైన అర్థాలు, అభివ్యక్తులు వీరి రచనల్లో మెండుగా ఉంటాయి. సామాజిక సంబంధాల్ని పటిష్ఠ పరిచే వావి వరుసలు, పిలుచుకునే పేర్లు, వాటిని సందోర్భచితంగా భావితరాలకు అందించే ప్రక్రియలు ఉంటాయి. మౌఖిక వారసత్వంగా అందిపుచ్చుకున్న అనుభవ పరిజ్ఞానం, భాష పరిజ్ఞానం ఉంటుంది. భాష పట్ల మమకారం ఉంటుంది. గత పాలకుల లోపభూయిష్ట విధానాల వల్ల, ప్రపంచీకరణ విధానాల వల్ల కళలతో కళకళలాడాల్సిన పల్లెలు ఈనాడు కొంత కళతప్పి వెలవెలబోతున్నాయి.నగరీకరణ చెంది పరభాష వ్యామోహంలో పడి కొట్టుకపోతున్న రేపటి తరాలకు తీయని పదాలు అందించాలంటే ఈ జానపద కళాకారులను, కళలను ఆదరించాల్సిన అవసరం ఉన్నది. కళాకారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. జానపద సాహిత్యంపై పరిశోధన చేస్తున్న వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి వారి పరిశోధనలకు ప్రచారం కల్పించాలి. గ్రామాల్లోకి వెళ్లి సబ్బండ కులాలు, శ్రమజీవుల లోగిళ్లు కలియతిరగాలి. అపురూపమైన పద సంపదంతా సేకరించి అక్షరరూపంలో నిక్షిప్తం చేసి సాహిత్య, సాంస్కృతిక వారసత్వంగా జానపదాన్ని భావితరానికి అందించాలి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జానపదుల సాహిత్య సేవకు సముచితమైన స్థానం దొరుకుతుందని, ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారిస్తుందని నమ్మకం ఉంది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/a-unique-position-for-folk-literature-1-2-561866.html