మహాసభలకు 550 బస్సులు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభలకు 550 బస్సులు

sp-singh-buses
భాషాభిమానులు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకలకు తరలివచ్చేందుకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు 500ల నుంచి 550 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ చెప్పారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్న మహోన్నత లక్ష్యంతో తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదన్నారు. సాహిత్యప్రియులు సభలలో పాల్గొనేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల నుంచి బస్సుల చొప్పున నడుపాలని చెప్పారు. స్థానిక పోలీస్ యంత్రాంగం, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకు జిల్లాల నుంచి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించుకోవాలన్నారు. విద్యాశాఖాధికారి, రవాణ, పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జెడ్పీ, డీసీసీబీ, మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్లకు ఆహ్వానలేఖలు పంపాలని చెప్పారు. సాహిత్యశాఖ ముద్రించిన బ్రోచర్లతో జిల్లాల్లో ప్రచారంచేయాలని సూచించారు.

తెలుగు మహాసభలకు 150 కార్లు
ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే ఆహ్వానితుల రవాణా కోసం 150 ఏసీ కార్లు, 70 ఆర్టీసీ ఏసీ బస్సులను రాష్ట్ర రవాణాశాఖ సమకూర్చింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా ఈ సభలకు వచ్చే జాతీయ, అంతర్జాతీయస్థాయి అతిథులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టినట్టు రవాణాశాఖ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. 150 కార్లలో 50 ఇన్నోవాలు, 50 మహేంద్ర ఎక్స్‌యూవీ, మరో 50 స్విఫ్ట్ డిజైర్ కార్లున్నాయని వివరించారు. వాహనాలను మహాసభల ఆహ్వాన కమిటీకి గురువారం అప్పగిస్తామని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ నుంచి 70 ఏసీ బస్సులను దేశ, విదేశీ అతిథుల కోసం ఏర్పాటు చేసింది. ఇందులో 30 గరుడ ఏసీ బస్సులు కాగా, వజ్ర ఏసీ బస్సులు 40 ఉన్నాయి. ఇటీవలి జీఈఎస్ సదస్సుకు కూడా ఆర్టీసీ అతిథుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మన్ననలను పొందింది. అతిథులు బసచేసే వసతి ప్రదేశాల నుంచి మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం వరకు రవాణా సౌకర్యం కోసం ఈ బస్సులు ఏర్పాటుచేశారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/550-buses-for-the-conference-says-sp-singh-1-2-561981.html