మహాసభలకు 450 మంది తెలుగు ఎన్నారైలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభలకు 450 మంది తెలుగు ఎన్నారైలు

ఆరు ఖండాల్లోని 41 దేశాల నుంచి 450 మంది తెలుగు ఎన్నారైలు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవుతున్నారని తెలుగు మహాసభల ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ దేశాల్లోని తెలుగువారు సైతం హాజరైతే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పారని, ఆ మేరకు 41 దేశాల్లోని 450 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని ఆయన నమస్తే తెలంగాణకు తెలిపారు. దక్షిణాఫ్రికాలోని మలావిలాంటి దేశంలోనూ మన తెలుగువారున్నారని, అక్కడి నుంచి కొండవీటి వెంకటేశ్వరరావు, సురేశ్‌కుమార్‌రెడ్డి, ఉన్నం రాజా లాంటివారు హాజరవుతున్నారని వివరించారు. బోట్స్‌వానా, కొలంబియా, ఇథియోపియా, ఫిజీ, ఉగాండా లాంటి దేశాల నుంచికూడా ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. ఒక్క మలేషియా నుంచే 100 మంది తెలుగువారు, న్యూజెర్సీ నుంచి డిప్యూటీ స్పీకర్ ఉపేందర్ చివుకుల లాంటివారుకూడా హాజరవుతున్నారని మహేశ్ బిగాల వివరించారు. ప్రతినిధుల ఎంపిక కోసం వివిధదేశాల్లో 13 సన్నాహక సదస్సులు నిర్వహించామని తెలిపారు. హాజరవుతున్న ప్రతినిధుల్లో 40 మంది సాహితీవేత్తలు ఉన్నారని చెప్పారు. అమెరికా కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్‌లో అన్ని స్కూళ్ళలో ఒకటి నుంచి 12వ స్టాండర్డ్ వరకు తెలుగును రెండోభాషగా ఎంపిక చేసుకునే అవకా శం కల్పించారని తెలిపారు. తెలుగు మహాసభల తర్వాత ప్రతి దేశంలోనూ ఫ్రీమౌంట్ తరహాలో నిర్ణయం కోసం ఒత్తిడి పెరుతుందని అన్నారు. మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నారని చెప్పినప్పుడు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు చాలా సంతోషించారని ఆయన చెప్పారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/450-telugu-nris-for-the-conference-says-mahesh-bigala-1-2-562043.html